అబిడ్స్, ఏప్రిల్ 28:వానకాలంలో నాలాల్లో వర్షం నీరు సాఫీగా వెళ్లేందుకు గాను ఖైరతాబాద్ జోన్ పరిధిలో నాలాల పూడిక తీత పనులు చురుకుగా సాగుతున్నాయి. పది కోట్ల 76 లక్షల రూపాయలతో ప్రారంభమైన పనులను త్వరగా పూర్తి చేయించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవి కిరణ్ పర్యవేక్షణలో ఎస్ఈ సహదేవ్ రత్నాకర్ ఆధ్వర్యంలోసర్కిల్ 12,13,14,17,18 పరిధుల్లోని నాలాలు , మ్యాన్‌హోళ్లలో పూడిక తీత పనులను పకడ్బందీగా జరిగేలా ఈఈలు, డీఈలు, ఏఈలు చర్యలు తీసుకుంటున్నారు. అంతే కాకుండా ముంపు ప్రాంతాలపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. నాలాల్లో జేసీబీతో పూడిక తీసి మట్టి ఆరిన తరువాత డంపింగ్ యార్డుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.తోప్‌ఖానా నాలా, మాలకుంట నాలా, అఫ్జల్‌సాగర్, సయ్యద్‌నగర్, బుల్కాపూర్ నాలాలతో పాటు బస్తీల్లోని మురికి కాలువల నుంచి మట్టిని బకెట్ల ద్వారా తోడుతున్నారు. మే నెలాఖరుకల్లా పూడికతీత పనులను పూర్తి చేయించేందుకుఅధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పూడికతీత పనులను ఎస్ఈ సహదేవ్ రత్నాకర్ ఇతర ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పర్యవేక్షిస్తున్నారు.
త్వరగా పనులు పూర్తి చేయిస్తాం
ఖైరతాబాద్ జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నాలాల పూడిక తీత పనులను చురుకుగా సాగుతున్నాయి. ఈ పనులను త్వరగా పూర్తి చేసేలా చర్య లు తీసుకుంటున్నాం. పూడికతీత పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించిసిబ్బందికి సూచనలు, సలహాలు ఇస్తు న్నాం. పూడిక తీసిన మట్టి ఆరిన తరువాత లారీల ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నాం.
– ఖైరతాబాద్ జోన్ ఎస్ఈ సహదేవ్ రత్నాకర్