ఖైరతాబాద్, ఏప్రిల్ 23: “దేశం, రాష్ట్రంలోని పబ్బులు, క్లబ్బులే డ్రగ్స్‌కు ఆవాసాలుగా మారుతున్నాయి. వాటిని అరికట్టకుంటే పరిస్థితి చేయిదాటి పోతుంది’ అని మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం జరిగిన ‘ఇండియా అగెనెస్ట్ డ్రగ్స్ జాయింట్ యాక్షన్ కమిటీ’ ఆవిర్భావ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన లెక్కల ప్రకారం ప్రతి ఏడాది డ్రగ్స్‌ను వాడే వారి సంఖ్య దేశంలో 8 నుంచి పది శాతం పెరుగుతున్నదని అన్నారు. దేశంలోని ఆరు కోట్ల మంది డ్రగ్స్‌కు బానిసగా మారారని, ఇది ఆందోళన కలిగించే అంశమన్నారు. 1986లో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోను ఏర్పాటు చేశారని, ఆ బ్యూరోలో దేశవ్యాప్తంగా కేవలం వెయ్యి మంది సిబ్బంది మాత్రమే ఉన్నారని, ప్రస్తుత జనాభా ప్రకారం అది ఏమూలకూ సరిపోదని చెప్పారు. నేషనల్ డ్రగ్ కంట్రోల్ ఏజెన్సీని నెలకొల్పి, దాని పరిధిలో ప్రతి రాష్ట్ర రాజధానిలో ఓ హెడ్‌క్వార్టర్ స్థాపించాలని, తద్వారా డ్రగ్స్‌ను సమూలంగా నివారించే అవకాశం ఉంటుందని తెలిపారు.
కేంద్ర హోం శాఖకు దీనిపై ఓ ప్రతిపాదన పంపానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీ సీవీ ఆనంద్ డ్రగ్స్‌ను అరికట్టడంలో సఫలీకృతులవుతున్నారని, వారు చేపడుతున్న చర్యలు అభినందనీయమని అన్నారు. ఇండియా అగనెస్ట్ డ్రగ్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ దగ్గుపాటి శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ, దేశంలో డ్రగ్స్ వినియోగం ప్రమాదకర స్థాయికి చేరుకున్నదని, దీన్ని అరికట్టాలంటే అందరి భాగస్వామ్యం కావాలని అన్నారు. తమ జేఏసీ తరపున పాఠశాలలు, కళాశాలల్లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలను చేపడుతామని చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్ 2న భారత మాదక ద్రవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రవాప్తంగా మానవహారాలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం 23తో మంది జేఏసీని ఏర్పాటు చేశారు.
ఇండియా అగెనెస్ట్ డ్రగ్స్ జేఏసీ కమిటీ..
కన్వీనర్‌గా దగ్గుపాటి శ్రీనివాస మూర్తి, సలహాదారులుగా వెంకట్‌రెడ్డి, ప్రకాశ్, జాయింట్ కన్వీనర్లుగా శశిరేఖ, అంజమ్మ, రాఘవేంద్ర గౌడ్, సుభాష్ చంద్రబోస్, కనకరాజ్, మల్లేశ్, గణేశ్ బత్తుల, ప్రసాద్ తోడేటి, జకీర్ హుస్సేన్, బాలకృష్ణ యాదవ్, రఘునందన్ వడ్ల, శ్రీనివాస్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, చేగొండి చంద్రశేఖర్, ఆవుల భూపతి, మధుబాబు, భాస్కర్ పవార్, దిట్టకవి వెంకటరమణ, కేవీఎల్ఎన్ మూర్తి, శ్రీరామ్ డేగలాస్ ఎన్నికయ్యారు.