అడ్డగుట్ట, ఏప్రిల్ 23: ఓ వృద్ధురాలికి చెందిన రూ.45 లక్షలను యోనో యాప్ ద్వారా కాజేసిన బ్యాంకు తాత్కాలిక ఉద్యోగిని అరెస్ట్ చేసిన తుకారాంగేట్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. శనివారం తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఎల్లప్ప కేసు వివరాలను వెల్లడించారు. భువనగిరికి చెందిన కేశవ్ శశికుమార్ (28) మారేడ్‌పల్లిలో అద్దెకుంటూ ఈస్ట్‌మారేడ్‌పల్లిలోని ఎస్బీఐ బ్యాంకులో 12 సంవత్సరాలుగా తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అయితే ఇదే బ్యాంకులో సఫిల్‌గూడకు చెందిన అనసూయ(75)కు అకౌంట్ ఉంది. ఆమె అకౌంట్లో రూ.48 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. అనసూయ కొడుకు, కూతురు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటుండటంతో బ్యాంక్ లావాదేవీల కోసం శశికుమార్ సాయం తీసుకునేది. క్రికెట్ బెట్టింగ్‌లు కాసి అప్పుల పాలైన శశికుమార్ ఇదే అదునుగా వృద్ధురాలి అకౌంట్ నుంచి నగదు కాజేసేందుకు పథకం రచించాడు.
2021 నవంబర్ 21న బ్యాంకు వచ్చిన వృద్ధురాలి ఫోన్లో యోనో యాప్ డౌన్లోడ్ చేయించాడు. అనంతరం ఆమె అకౌంట్‌కు తన నెంబర్‌ను యాడ్ చేశాడు. రూ.45 లక్షల ఓవర్ డ్రాఫ్ట్ లోన్ తీసుకొని అకౌంట్‌కు మళ్లించుకున్నాడు. ఆ నగదుతో అప్పులు తీర్చా డు. అయితే తీసుకున్న లోన్‌కు ఈఎంఐ కట్టడం లేదంటూ బ్యాంకు సిబ్బంది వృద్ధురాలికి ఫోన్ చేయడంతో బ్యాంకుకు వచ్చిన ఆమె విషయం తెలుసుకొని తుకారాంగేట్ పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు చేసిన పోలీసులు శశికుమార్‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. రూ.9.50 లక్షలు స్వాధీనంతో పాటు తన అకౌం ట్లోని రూ.15.25 లక్షలను ఫ్రీజ్ చేయించారు.