మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 23: పాఠశాలల్లో మౌలిక సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సౌకర్యాలు కల్పిస్తామని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం మేడ్చల్ మండలం గౌడవెల్లి, నూతన్‌కల్, రావల్కోల్, మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లి పాఠశాలలో ‘మన ఊరు-మనబడి’ నిధులతో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ..కోట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. ‘మనఊరు-మనబడి’ కార్యక్రమానికి బడ్జెట్లో రూ.7300 కోట్లు కేటాయించారని, వీటితో ఫర్నిచర్, పెయింటింగ్, విద్యుత్, టాయిలెట్లు, డ్రైనేజీ తదితర సమస్యలు పరిష్కరించనున్నట్లు తెలిపారు. కరోనా కాలంలో నాణ్యమైన విద్యనందించడంలో మేడ్చల్ జిల్లా మొదటిస్థానంలో నిలిచిందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 1 నుంచి 8 తరగతుల వరకు ఆంగ్లమాధ్యమంలో బోధిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రజితారాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజావిజయేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నందారెడ్డి, మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ మర్రి దీపికా నర్సింహారెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పీఏసీఎస్‌ల చైర్మన్లు, టీఆర్ఎస్ మండల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.