ఖైరతాబాద్, ఏప్రిల్ 23: ‘అధికారంలోకి రాక ముం దు వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామన్నారు.. వచ్చి ఎనిమిదేండ్లు అవుతుంది… ఒక్క అడుగు కూడా ముందు కు వేయలేదు. మాదిగలను మోసగించిన బీజేపీకి భారీ మూల్యం తప్పదు’ అని ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మం ద కృష్ణ మాదిగ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్ జాతీయ, తెలంగాణ, ఏపీ రాష్ర్టాల నూతన కమిటీని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మా ట్లాడుతూ దశాబ్దాలుగా వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ పోరాటాలు నిర్వహిస్తున్నదని, వర్గీకరణ సాధించుకొని తీరుతామన్నారు. కేంద్ర ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేకపోయిందని, నేడు మాదిగల ముందు దోషిగా నిలబడిందన్నారు. వర్గీకరణ చేపట్టకుంటే బీజేపీకి భారీ మూల్యం తప్పదన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఇద్దరూ చొరవ తీసుకొని ప్రధాని, హోం శాఖ మంత్రికి వినతి పత్రాలు ఇచ్చి వారిని ఒప్పించాలన్నారు. వర్గీకరణ అంశంలో టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు మద్దతుగా నిలుస్తున్నాయని, లోక్‌సభ, రాజ్యసభల్లో వారి గళాన్ని వినిపిస్తూ కేంద్రాన్ని నిలదీస్తూనే ఉన్నాయన్నారు. వర్గీకరణే లక్ష్యంగా నూతనంగా ఎన్నికైన ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్ జాతీయ, రాష్ర్టాల కమిటీ బృందం ఈ నెల 25 నుంచి 30 వరకు తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో అన్ని జిల్లాల్లో పర్యటనలు చేపడుతుందని, మాదిగ యువకులు, ప్రజలను కూడగట్టడానికి ఆ బృందం పాటుపడుతుందన్నారు.
నూతన కమిటీలు
ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులుగా డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ, అధికార ప్రతినిధిగా బొర్ర బిక్షపతి మాదిగ, ప్రధాన కార్యదర్శిగా జిల్లా వెంకట్ మాదిగ, ఉపాధ్యక్షులుగా జలదంకి నరసింగరావు మాదిగ, డాక్టర్ చిన్నోళ్ల తిరుపాల్ మాదిగ, కార్యదర్శులుగా మాతంగి ఓదేలు మాదిగ, బొజ్జ సైదులు మాదిగ, ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ, రాగళ్ల ఉపేందర్ మాది గ, అధికార ప్రతినిధిగా డాక్టర్ ఒద్దెపోగు రవి కుమార్ మాదిగ, ఉపాధ్యక్షులుగా తోకల చిరంజీవి మాదిగ, బిక్కి మురళీ కృష్ణ మాదిగతో పాటు ఆయా సంఘాల రాష్ట్ర కమిటీలను మందకృష్ణ మాదిగ ప్రకటించారు.