సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): కొవిడ్ తర్వాత ఐటీ ఉద్యోగుల పని తీరు విధానంలో మార్పు ఉంటుందని, కొత్తగా అందరికీ అనువైన ఫ్లెక్సిబుల్ వర్కింగ్ మోడల్ అమల్లోకి రానుందని ఐటీ రంగం నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కౌన్సిల్ నిర్వహించిన 8వ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సమ్మిట్‌లో భాగంగా ‘ట్రాన్సిషనింగ్ వర్క్ స్పేస్ ఫార్వార్డ్ ’ అనే అంశంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ ఐటీ ఇన్వెస్ట్మెంట్ సీఈవో విజయ్ రంగినేని మాట్లాడుతూ ఐటీ ఉద్యోగులు ఇక ఇండ్ల నుంచి కాకుండా వ్యక్తిగతంగా ఆఫీసులకు వచ్చి పని చేయాల్సిన అవసరం ఏర్పడిందని, ఇందుకు ఐటీ కంపెనీల నిర్వాహకులు సిద్ధంగా ఉండాలని సూచించారు. దివ్యశ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎఫ్‌వో సీఎన్రావు మాట్లాడుతూ ఇక నుంచి హైబ్రిడ్ మోడల్ విధానంలో ఐటీ ఉద్యోగులు పని చేసేందుకు అవకాశం ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయన్నారు. జూలై నాటికి 50 శాతం ఐటీ ఉద్యోగులు ఐటీ కంపెనీలకు వచ్చి పని చేసే అవకాశం ఉందన్నారు. హెచ్ఎస్బీసీ గ్లోబల్ సర్వీస్ సెంటర్ ఎండీ మమతా మాదిరెడ్డి మాట్లాడుతూ బ్యాంకింగ్ పరిశ్రమలకు ఇంటి నుంచి పని చేయడం కొత్తదని, దశల వారిగా కార్యాలయాలకు తిరిగి వస్తున్నారని అన్నారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రెటరీ జనరల్ కృష్ణ ఏదుల మాట్లాడుతూ ప్రస్తుతం 15 శాతం ఐటీ ఉద్యోగులు కార్యాలయాల నుంచి పని చేస్తున్నారని, జూలై నాటికి 50 శాతం కంటే ఎక్కువ మంది వస్తారని చెప్పారు.
ప్రతి సోమవారం చేనేత వస్ర్తాలు..
ఐటీ సెక్టార్లో ప్రతి సోమవారం చేనేత దుస్తులను ధరించే విధంగా ఫెసిలిటీ మేనేజ్మెంట్కు చెందిన 20 మంది నిపుణులతో హ్యాండ్లూమ్ ర్యాంప్ వాక్‌ను నిర్వహించారు. చేనేత కార్మికులకు మద్దతు ఇవ్వడానికి ‘హ్యాండ్లూమ్ మండే’ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. డ్రైవ్‌లో భాగంగా టీఎఫ్ఎంసీ ఇప్పటి వరకు రూ.3.2కోట్ల విలువైన చేనేత వస్ర్తాల విక్రయం జరిగిందని, 18 హ్యాండ్లూమ్ మేళాలు నిర్వహించామని , 2.8 లక్షల మంది ఐటీ నిపుణులు చేనేత వస్ర్తాలను ధరించారని తెలిపారు.
ప్రత్యామ్నాయ రవాణాను ప్రోత్సహించాలి
నగరంలోఉన్న ఐటీ కంపెనీల్లో సుమారు 7లక్షల మందికి పైగా పనిచేస్తుంటారు. ప్రస్తుతం 10-15 శాతం ఐటీ ఉద్యోగులు కార్యాయాలకు తిరిగి వస్తుండడంతో రద్దీ పెరిగింది. 100 శాతం ఐటీ ఉద్యోగులు వస్తే ట్రాఫిక్ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.దీన్ని పరిగణలోకి తీసుకొని కార్ పూలింగ్, ప్రజా రవాణా, స్మార్ట్ రవాణా వ్యవస్థలు, ప్రత్యామ్నాయ రవాణా విధానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోని టాప్ 30 బ్రాండ్లకు చెందిన కంపెనీలు తమ కార్యాలయాలు నగరంలో ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
– అమర్నాథ్ రెడ్డి ఆత్మకూరి, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ
ప్రతి రోజు 2 గంటలు రోడ్ల మీదే..
నగరంలో ఒక మనిషి రోజు వారి సమయంలో 7 శాతం (2 గంటలు) రోడ్లపైనే గడుపుతున్నారు. రద్దీ ఇలాగే కొనసాగితే వాహనాల రాకపోకల సగటు వేగం 9 కి.మీకు తగ్గుతుంది. ప్రస్తుతం నగరంలో 21. కి.మీగా ఉంది. మెట్రో రైలులో రోజు 2.50లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి 4లక్షలకు చేరుకునే అవకాశం ఉంది.
– మురళీ వరదరాజన్,ఎల్ అండ్ టీ మెట్రో అధికారి