రైస్ బకెట్ చాలెంజ్..
2014లో రైస్ బకెట్ చాలెంజ్‌ను మంజులత కరుణానిధి ప్రారంభించారు. అన్నార్తుల కోసం పెద్ద ఎత్తున బియ్యం సేకరించి అవసరమైన ఆశ్రమాలకు, నిరుపేదలకు అందించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. పేదరికంతో ఆకలిబాధలను ఓర్చుకుని బడికి పోతున్న చాలా మంది విద్యార్థుల జీవితాలను అధ్యయనం చేసిన ఆమె ఈ నిర్ణయం తీసుకుని రైస్ బకెట్ ఛాలెంజ్ ప్రకటించారు. మొదట్లో ఆమెకు బియ్యం సేకరణ చాలా కష్టమైంది. కొంతకాలానికి ఆమె ట్విట్టర్ ఖాతాను ప్రారంభించింది. రైస్ బకెట్ చాలెంజ్‌పై ఆమె పోస్ట్‌కు చాలా మంది నెటిజన్లు స్పందించారు. ట్విట్టర్లో ఆమె పోస్ట్ 10వేల సార్లు ట్రెండ్ అయిందంటే అతిశయోక్తి కాదు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి 2015లో ఆమె ట్వీట్‌ను రీట్వీట్ చేయడం మరో విశేషం.
ఎంపిక ఇలా..
ట్విట్టర్ ఇండియా ఆదర్శ మహళలను ఎంపిక కోసం అన్ని రాష్ర్టాల మహిళల ట్విట్టర్ ఖాతాలను సంప్రదించింది. సామాజిక సేవల కోసం ట్విట్టర్ అకౌంట్ ఉపయోగిస్తున్న మహిళలకు ఇంకా చేయాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా? తదితర ప్రశ్నావళితో వారు ఎంపిక చేసుకున్న మహిళలతో టీమ్ సంభాషించింది. అందులో ఎంపికైన వారికి జూమ్ మీటింగ్ నిర్వహించి మరోమారు సంభాషించిన అనంతరం నగరానికి చెందిన ఇద్దరు మహిళలను ఎంపిక చేసి వారిని సత్కరించింది.
ఆకలితీర్చడంలోనే సంతృప్తి
నిరుపేదల కోసం రైస్ బకెట్ ఛాలెంజ్ మొదలుపెట్టాం. అందుకోసం సోషల్ మీడియాను వినియోగించుకున్నాం. మా దృష్టికి వచ్చిన నలుగురు విద్యార్థుల ఫీజు చెల్లించడానికి ట్విట్టర్లో చేసిన ఒక్క పోస్ట్‌తో సాయంత్రానికి దాతలు సిద్ధమయ్యారు. మా ఛాలెంజ్ ద్వారా మేం కరోనా ముందు వరకు 25 లక్షల కేజీల బియ్యం డొనేట్ చేశాం. కరోనాలో 21 లక్షల విలువజేసే నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం.
– మంజులత కళానిధి,రైస్ బకెట్ చాలెంజ్ ఫౌండర్
బాలికల సమస్యలకు పరిష్కారం
నిరుపేద కుటుంబాలకు చెందిన బాలికలు చాలా భయంభయంగా ఉంటారు. ఆర్థిక కష్టాలతో సరైన చదువు వారికి దొరకదు. వయసుకు తగిన విధంగా బరువు, ఎత్తు ఉండకపోవడంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. సామాజిక అంశాలపై అవగాహన ఉండదు. మా సంస్థ ద్వారా మేం బాలికలతో ఇంటరాక్ట్ అయి వారికి ధైర్యం కల్పించి కావాల్సిన సాయం అందేలా చేస్తున్నాం.
– వాయిస్ ఫర్ గర్ల్స్ ఎన్జీవో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూష భరద్వాజ
బాలికల హక్కుల కోసం..
నిరుపేద బాలికల కష్టాలు.. వారు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు.. తదితర విషయాలపై వారిని చైతన్యం చేయడానికి వాయిస్ ఫర్ గర్ల్స్ సంస్థను అనూష భరద్వాజ ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తూ విద్యార్థుల కష్టాలు తెలుసుకుని సాయం అందిస్తారు. లైంగిక వేధింపులు ఎదురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయడంపై అవగాహన కల్పిస్తారు. చదువుల్లో రాణించే అమ్మాయిలకు ఆర్థిక సాయం అందేలా చేస్తారు. ఈ కృషికి గాను ఆమెకు ట్విట్టర్ ఇండియా చేంజ్ మేకర్స్ జాబితాలో చోటు లభించింది.