ఘట్కేసర్ రూరల్, ఏప్రిల్ 23 : రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి మండల వ్యవసాయాధికారులను ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలో శనివారం వ్యవసాయాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని, ఇందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.1960 కి కొనుగోలు చేస్తుందన్నారు. రాష్ట్ర రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని చెప్పారు. ఈ సమావేశంలో మండల వ్యవసాయాధికారి ఎంఏ బాసిత్, డిప్యూటీ తాసీల్దార్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం అందించాలి
గర్భిణులు, పిల్లలకు సరైన సమయంలో పౌష్టికాహారం అందించాలని ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఎదులాబాద్‌లోని అంగన్వాడీ కేంద్రాన్ని ఎంపీపీ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రానికి వస్తున్న ఆహారం పంపిణీ చేసిన వివరాలను పరిశీలించారు. ప్రతి ఒక్కరికి పౌష్టికాహారాన్ని పంపిణీ చేసి తల్లీపిల్లల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలని చెప్పారు. సర్పంచ్ సురేశ్ పాల్గొన్నారు.
ఇఫ్తార్‌విందులో పాల్గొన్న ఎంపీపీ..
ఎదులాబాద్‌లో రంజాన్ పండుగ సందర్భంగా నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ ఎన్ చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ముస్లిం సోదరులు సన్మానించారు. సర్పంచ్ సురేశ్, ఎంపీటీసీ రవి, ఉప సర్పంచ్ లింగేశ్వర్ రావు, పంచాయతీ సభ్యులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.