మన్సూరాబాద్, ఏప్రిల్ 23: దళితుల అభ్యున్నతికోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు పథకం దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో భాగంగా నియోజకవర్గంలో మొదటి విడుత లో 100 మందిని ఎంపిక చేశారు. కార్లు, ట్రాక్టర్లు, గూడ్స్ వాహనాలకు ఎంపిక చేసుకున్న 36మంది లబ్ధిదారులతో శనివారం ఎమ్మెల్యే సమావేశాన్ని నిర్వహించారు.వారికి పలు సూచనలు, సలహాలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.10లక్షల కంటే అధికంగా ఎస్టిమేషన్ ఇచ్చిన వారు అదనపు డబ్బులను సొంతంగా భరించాల్సి ఉంటుందన్నారు. కార్లు, ట్రాక్టర్లు, గూడ్స్ వాహనాలను ఎంపిక చేసుకున్న లబ్ధిదారులు ప్రైవేటు కంపెనీలతో మాట్లాడుకుని తమ వాహనాలకు నడిపించుకునేలా ఒప్పందం చేసుకోవాలని ఆయన సూచించారు. దళితబంధు లబ్ధిదారులు తాము ఎదగడమే కాకుండా ఇతరులకు ఉపాధి కల్పించాలని ఆయన సూచించారు. దళితబంధు పథకంతో పాటు పేదల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన సీఎంకేసీఆర్ చిరకాలం ప్రజల గుండె ల్లో నిలిచిపోతారని తెలిపారు. కార్యక్రమంలో ఈడీఎస్సీ కార్పొరేషన్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దళితబంధులో మాలలకు ప్రాధాన్యతనివ్వాలి
ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఆర్థికంగా వెనుకబడి ఉన్న మాల యువకులకు దళితబంధు పథకంలో అధిక ప్రాధాన్యతనివ్వాలని కోరుతూ శనివారం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి నియోజకవర్గ తెలంగాణ మాలల ఐక్య వేదిక ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ మాలల ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలో సుమారు 30వేల దళిత కుటుంబాలు ఉన్నాయని.. ఇందులో ఉన్న మాల కులానికి చెందిన కుటుంబాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. మాల యువకులకు ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాలు సరిగా అందలేదని తెలిపారు.కార్యక్రమంలో నియోజకవర్గ తెలంగాణ మాలల ఐక్యవేదిక అధ్యక్షుడునర్సింగ్రావు, ప్రధానకార్యదర్శి కిషన్, ఉపాధ్యక్షుడు చంద్రమోహన్, నాయకులు దేవరాజ్, నరేశ్, పెంటయ్య ఉన్నారు.