ఖైరతాబాద్, ఏప్రిల్ 23 : జీహెచ్ఎంసీకి ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన ప్రతి రూపాయి నగరాభివృద్ధికి దోహదపడుతుంది. అందుకే సాకాలంలో పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి పాటుపడాలని అధికారులు అంటున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తి పన్నుల చెల్లింపుల్లో భాగంగా ముందస్తుగా చెల్లించిన వారికి ఎర్లీ బర్డ్ ఆఫర్ ద్వారా జీహెచ్ఎంసీ ఐదు శాతం రిబేట్‌ను ఇస్తున్నది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ నెల 6న ఆఫర్ ప్రారంభమైంది. గడిచిన పదిహేడు రోజుల్లో ఖైరతాబాద్ సర్కిల్ 17లో అనూహ్య స్పందన వచ్చింది. ప్రజలు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌తో పాటు సిటీజన్ సర్వీస్ సెంటర్లకు పన్నులు చెల్లించేందుకు బారులు తీరుతున్నారు. గతేడాది లక్ష్యాన్ని అదిగమించే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు.
29.72 కోట్లు చెల్లింపులు..
సర్కిల్ 17 పరిధిలో గతేడాది ఏప్రిల్ 30 నాటికి 15,505 అసెస్మెంట్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ.37.09 కోట్లు ఉండగా, ఈ ఏడాది 15 రోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయి కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటి వరకు 18,600 అసెస్మెంట్ల ద్వారా రూ.29.72 కోట్లు వచ్చాయి. 30వ తేదీ నాటికి గత సంవత్సరం చెల్లింపులను దాటి అత్యధికంగా ఎర్లీబర్డ్ ఆఫర్ ద్వారా పన్నులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు.
సద్వినియోగం చేసుకోండి
ఎర్లీ బర్డ్ ఆఫర్లో ఆస్తి పన్ను చెల్లించిన వారికి 5 శాతం రిబేట్‌ను కల్పిస్తున్నాం. ప్రజలకు బల్క్ మెసేజ్‌లు, వివిధ ప్రసార మాద్యమాల ద్వారా అవగాహన కల్పించాం. ఈ ఏడాది గడువుకు ముందే అధిక కలెక్షన్స్ వచ్చాయి. ఈ నెల 30వ తేదీ వరకు ఆఫర్ కొనసాగుతుంది. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
– వంశీకృష్ణ, డిప్యూటీ కమిషనర్ సర్కిల్ 17