శామీర్‌పేట, ఏప్రిల్ 22 : పేద విద్యార్థులకు మెరుగైన, నాణ్యమైన విద్యను అందించేందుకే సీఎం కేసీఆర్ ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నూతన విద్యా విధానంలో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుదని తెలిపారు. మన ఊరు, మన బడి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శామీర్‌పేట మండలంలోని శామీర్‌పేట, తుర్కపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ శామీర్‌పేట ప్రభుత్వ పాఠశాలకు రూ.50 లక్షలు, తుర్కపల్లి ప్రభుత్వ పాఠశాలకు రూ.30 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ నిధులతో పాఠశాలలకు పేయింటింగ్, వంటగది నిర్మాణం, విద్యుత్, మూత్రశాలల ఏర్పాటు, తదితర మౌలిక వసతులు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వాల పాలనలో ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకున్న నాథుడే కరువయ్యాడని, నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు దీటుగా తయారవుతున్నాయని అన్నారు.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి సుమారు రూ.లక్షకు పైగా ఖర్చు చేస్తున్నదని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ బోధన జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈవో విజయకుమారి, ఎంపీపీ ఎల్లూభాయిబాబు, జడ్పీటీసీ అనితలాలయ్య, వైస్ ఎంపీపీ సుజాత, సర్పంచ్‌లు బాలమణి, కవితవేణుగోపాల్రెడ్డి, ఎంఈవో వసంతకుమారి, ఉపసర్పంచ్ రమేశ్‌యాదవ్, యూసుప్బాబా, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్, నియోజకవర్గం ఇన్చార్జి మహేందర్‌రెడ్డి, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మన ఊరు – మన బడి పనులను త్వరగా పూర్తి చేయాలి:అధికారులను ఆదేశించిన హైదరాబాద్ కలెక్టర్
మన ఊరు-మనబడికి సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ ఆదేశించారు. శుక్రవారం తన కార్యాలయంలో జిల్లా విద్యాధికారిని రోహిణి, స్పెషల్ ఆఫీసర్లు, ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు పూర్తి చేసిన పనుల గురించి ఆరా తీశారు. జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ బడుల్లో మన ఊరు-మన బడి పనులు పూర్తి చేయాలన్నారు.