సికింద్రాబాద్, ఏప్రిల్ 22: కంటోన్మెంట్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని.. త్వరలోనే వెయ్యి పడకల దవాఖాన నిర్మాణ పనులు ప్రారంభిస్తామని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇంటి పండుగలా నిర్వహించాలని పిలుపునిచ్చారు. బాలంరాయిలోని క్లాసిక్ గార్డెన్లో శుక్రవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న నేతృత్వంలో నియోజకవర్గస్థాయి కార్యకర్తలతో విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించాలన్నారు. వార్డులు, బస్తీల్లో పార్టీ జెండాలను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 1500 మంది దళితులకు దళితబంధు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అనేక అభివృద్ధి పనులకు వందల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వంపై కొందరు అవాకులు చెవాకులు పేలుతున్నారని.. వారికి తగిన బుద్ధి చెబుతామన్నారు.
టీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దమ్ముంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో గోదావరి జలాల పైప్లైన్లను అడ్డుకున్న ఆర్మీ, రైల్వే అధికారులకు నీరు, కరెంట్ సరఫరా నిలిపేస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించడంతో వారు దిగొచ్చి అనుమతులు ఇచ్చారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నేత మర్రి రాజశేఖర్‌రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేష్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు నివేదిత, బోర్డు మాజీ సభ్యులు ప్రభాకర్, శ్యామ్‌కుమార్, నళినికిరణ్, లోక్‌నాథ్, పాండుయాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, నేతలు ముప్పిడి గోపాల్, ముప్పిడి మధుకర్, లతామహేందర్, ఆయా వార్డుల అధ్యక్షులు పాల్గొన్నారు.
‘బండి’పై ప్రజలే తిరుగుబడుతారు..
రాష్ట్ర ప్రభుత్వంపై అడ్డగోలు విమర్శలు చేస్తున్న బండి సంజయ్‌పై ప్రజలే తిరుగుబడుతారు. రాష్ర్టానికి ఒక్క రూపాయి తేని బండి టీఆర్ఎస్ ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలుతున్నారు. స్వరాష్ట్రంలో పాలన, సంక్షేమ పథకాలు బాగున్నందున పక్క రాష్ర్టాల ప్రజలు తెలంగాణలో కలుపుకోవాలని వేడుకుంటున్నారు. కర్ణాటకలో మంత్రులు కమీషన్లు వసూలు చేస్తున్నందున కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొంది. గుజరాత్లో కరెంట్ కోసం రైతులు రోడ్డెక్కుతున్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎంపీ సంజయ్ పసలేని ఆరోపణలు చేయడం సిగ్గుచేటు.
– మాగంటి గోపినాథ్, టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు
అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం..
టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం. ఈ నెల 27 పార్టీ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని కంటోన్మెంట్‌లోని అన్ని బస్తీలు, డివిజన్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం. ఈ వేడుకల్లో బోర్డు మాజీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలి.
– జి. సాయన్న, కంటోన్మెంట్ ఎమ్మెల్యే
పేదల సంక్షేమమే సర్కారు ధ్యేయం
పేదల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. సీతాఫల్‌మండీలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన అడ్డగుట్ట, మెట్టుగూడ, తార్నాక, సీతాఫల్మండి, బౌద్దనగర్ డివిజన్లకు చెందిన పార్టీ నేతలు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్న ఈ సమావేశంలో పద్మారావు గౌడ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్కు కంచుకోటగా ఉందన్నారు. ఆవిర్భావ వేడుకలను అన్ని డివిజన్లలో ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు సునిత, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, కంది శైలజ, టీఆర్ఎస్ నియోజవర్గ సమన్వయకర్తలు రాజసుందర్, జలంధర్ రెడ్డి, నేతలు కంది నారాయణ, లింగాని శ్రీనివాస్, రామేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.