బన్సీలాల్‌పేట్, ఏప్రిల్ 22 : పేదలకు సర్కారు దవాఖానల వైద్య సేవలపై మరింత విశ్వాసం పెరిగిందని అదనపు డీఎంఈ, గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రా జారావు అన్నారు. సూ పరింటెండెంట్గా రెండేండ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న ఆయనకు సహచర వైద్యులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ 1987లో గాంధీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ విద్య కోసం అడుగుపెట్టిన తాను ఇక్కడే డాక్టర్‌గా, సహాయ, అసోసియేట్, ప్రొఫెసర్‌గా, జనరల్ మెడిసిన్ విభాగం హెచ్ఓడీగా పనిచేశాననన్నారు. 35 ఏండ్లుగా గాంధీకి వస్తున్న తాను ఇంటి కన్నా అధిక సమయం ఇక్కడే గడిపానని, ఇది తనకు దేవాలయం లాంటిదని తెలిపారు. కరోనా కేసులు భారీగా పెరిగి, లాక్డౌన్ ఆంక్షలు అమలు ఉన్న కీలకమైన సమయంలో 2020 ఏప్రిల్ 22న సూపరింటెండెంట్‌గా తాను బాధ్యతలు చేపట్టానన్నారు.
గడచిన రెండేండ్లలో లక్ష మంది కరోనా బాధితులు పూర్తిగా కోలుకున్నారని, ప్రపంచంలోనే అత్యధిక కరోనా రోగులకు వైద్య సేవలందించిన ఏకైక, తొలి సర్కారు దవాఖాన రికార్డు గాంధీకే దక్కిందని తెలిపారు. అదే సమయంలో 35 వేల టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు కలిగి, 650 ఆక్సిజన్ వెంటిలేటర్లు కలిగి ఉన్న తమ దవాఖానలో రెండు వేల మంది కరోనా సోకిన గర్భిణులకు సురక్షిత ప్రసవాలు జరిగాయని, కరోనా బారిన పడిన ఎనిమిది వేల మంది కిడ్నీ బాధితులకు డయాలసిస్ చేశామన్నారు. కోలుకున్న రోగులు తమకు పునర్జన్మ ఇచ్చిన గాంధీ దవాఖానకు, ఇక్కడి వైద్యులు, నర్సులు, సిబ్బందికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పడం ఎంతో ఆనందం కలిస్తున్నదన్నారు. ప్రతి రోగికి మరింత మెరుగైన వైద్య సేవలు అందించడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ప్రస్తుతం గాంధీలో 130 శాతం ఆక్యుపెన్సీ ఉన్నదని, ఉన్న బెడ్ల కంటే ఎక్కువగా రోగులు దవాఖానలో అడ్మిట్ అయి ఉన్నారని, ఒక్కో డాక్టర్ తన పరిమితికి మించి విధినిర్వహణలో నిమగ్నమయ్యారన్నారు.