జూబ్లీహిల్స్,ఏప్రిల్22: యూసుఫ్‌గూడ సర్కిల్లో జీహెచ్ఎంసీ అధికారులు రోడ్డు విస్తరణ పనులను వేగవంతంగా చేయనున్నారు. యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ నుంచి రహ్మత్‌నగర్ వరకు ప్రతిపాదిత 80 నుంచి 100 ఫీట్ల రోడ్డు విస్తరణకు బల్దియా అధికారులు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సర్వే పూర్తిచేసిన యూసుఫ్‌గూడ-19 వ సర్కిల్ అధికారులు తుది నివేదికను జోనల్ కమిషనర్ ప్రియాంకకు అందజేశారు. ఈ మేరకు జడ్సీ ప్రియాంక శుక్రవారం డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ రమేశ్‌తో పాటు టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పర్యటించారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రతిపాదనలతో బోరబండకు వెళ్లే ఈ ప్రదాన రహదారిపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు డబుల్ రోడ్డును అభివృద్ధి చేసిన అధికారులు కొన్ని చోట్ల ఈ పనులపై ముందడుగు వేయలేకపోయారు. దీంతో యూసుఫ్‌గూడ.. రహ్మత్‌నగర్ ప్రాంతాల్లో ఈ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో వెంగళరావునగర్, యూసుఫ్‌గూడ, రహ్మత్‌నగర్ కార్పొరేటర్లు దేదీప్య విజయ్, రాజ్‌కుమార్ పటేల్, సీఎన్ రెడ్డిలు రోడ్డు విస్తరణ సమస్యను స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో లేవనెత్తడంతో పాటు తరచూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో జోనల్ కమిషనర్ ప్రియాంక ఇక్కడ పర్యటించి అధికారులతో కలిసి ఆయా ప్రాంతాల్లో రహదారులను పరిశీలించారు. రోడ్డు విస్తరణ చేపడుతామని తెలిపారు. కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్, ఈఈ రాజ్‌కుమార్, ఏఎంఓహెచ్ డాక్టర్ బిందు భార్గవి తదితరులు పాల్గొన్నారు.