శేరిలింగంపల్లి, ఏప్రిల్ 11: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి సర్కిల్-20 పరిధిలోని రాయదుర్గం ఫిరంగీనాలా పూడికతీత పనులు పది రోజులుగా జోరందుకున్నాయి. రాబోయే వర్షకాలాన్ని దృష్టిలో ఉంచుకొని గచ్చిబౌలి డివిజన్లో ముందస్తు చర్యలను విస్తృతం చేశారు. రాయదుర్గం మల్కంచెరువు నుంచి వెస్ట్రన్ ప్లాజా వరకు దాదాపు 1200 మీటర్ల పొడవు విస్తీర్ణం కలిగిన నాలను జేసీబీ సహాయంలో శుభ్రం చేస్తున్నారు. నాలాలో పేరుకుపోయిన చెత్త, చెదారం, ప్లాస్టిక్, వ్యర్థాలను తొలగిస్తున్నారు. శేరిలింగంపల్లి సర్కిల్ అధికారులు ఈ మేరకు 10 రోజులుగా పనులు కొనసాగిస్తున్నారు. 1000 మీటర్ల పొడవు, 9 నుంచి 12 మీటర్ల భారీ వెడల్పు కలిగిన నాలాలో జేసీబీ సహాయంతో వేగంగా పూడికతీత పనులు చేపడుతున్నారు. స్థానికంగా రాయదుర్గం, ముస్లిం బస్తీ, వెస్ట్రన్ప్లాజా, మణికొండ పరిసర ప్రాంతాలకు, స్థానిక ప్రజలకు వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా, లొతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
టెలికాంనగర్‌లో..
శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని గచ్చిబౌలి డివిజన్ టెలికాంనగర్ నాలా పనులు వారం రోజులుగా కొనసాగుతున్నాయి. గచ్చిబౌలి సైబరాబాద్ కమిషనర్ కార్యాలయం సమీపంలోని 600 మీటర్ల పొడవు కలిగిన ఈ నాలా పూడికతీత పనులను జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్వహిస్తున్నారు. ఈ పనులను సోమవారం శేరిలింగంపల్లి సర్కిల్-20 ఈఈ శ్రీనివాస్‌లు పరిశీలించారు. పనుల్లో జాప్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేయాలని సంబందిత ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. రాబోయే వర్షాకాలంలో నాలా పరిసర ప్రాంతాల్లో వరద ముప్పు వాటిళ్లకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలను పర్యవేక్షించారు. వర్షాకాలంలో వర్షఫునీటి ప్రవాహానికి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ముందస్తు చర్యల్లో బాగంగా సర్కిల్ పరిధిలోని రాయదుర్గం ఫిరంగినాలా పూడికతీత పనులు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు.