సిటీబ్యూరో, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ వికృత నిర్ణయాలతో సామాన్యుల పరిస్థితి అమగ్యగోచరంగా మారింది. ‘మూలిగే నక్కపై తాటి పండు పడింది’ అన్న చందంగా మారింది దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజల పరిస్థితి. ఎటొచ్చీ.. సామాన్యుడి నడ్డి విరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వ ప్రతికూల నిర్ణయాలతో పేద, మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. నిన్నటి వరకు నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్, డొమెస్టిక్ గ్యాస్ ధరల పెంపుతో వాతలు పెట్టిన కేంద్ర ప్రభుత్వం తాజాగా కమర్షియల్ గ్యాస్ ధరలు పెంచి పరోక్షంగా సామాన్యులకు ఊపిరి ఆడకుండా చే సింది. ఈ ధరల పెరుగుదల కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు, తదితర ఫుడ్ ఇండస్ట్రీ రంగాలన్నీ తమ ఉత్పత్తుల ధరలు పెంచడానికి సన్నద్ధమవుతున్నాయి. ఈ పెరుగుదల లోటును పూడ్చుకోవడానికి వాళ్లు తయా రు చేసిన ఉత్పత్తుల ధరలు పెంచనున్నాయి. టీ కొట్టు నుంచి స్టార్ హోటళ్ల వరకు ఆహార ఉత్పత్తులు ప్రియం కానున్నాయి. ఈ ప్రభావం మళ్లీ సామాన్యుడే ఎదుర్కోవాల్సిన దుస్థితి వచ్చింది. తాజాగా.. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై ధర రూ.250లు పెరిగింది. దీంతో నగరంలో కొత్త ధర రూ.2400పైకి చేరింది. ఈ పెరుగుదల అంతా చిన్న తరహా హోటళ్లు, నాలుగు చక్రాల బండ్లు, టీ స్టాళ్లపై తీవ్ర ప్రభావం చూపనుంది.
మండుతున్న ఇంటి గ్యాస్..!
మొన్నటి వరకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.952లుగా ఉంది. మార్చి 22న కేంద్ర ప్రభుత్వం ఒక్కో సిలిండర్‌కు (14.2 కేజీల) రూ.50లు పెంచింది. దీంతో ఒక్కో సిలిండర్ ధర రూ.1000లు దాటింది. ఇంతటి ధర చెల్లించి సిలిండర్‌ను కొనుగోలు చేయడమంటే ఒక్కసారి భారం పెరుగుతుందని సామాన్యులు వాపోతున్నారు. గ్యాస్ సిలిండర్లపై ప్రభుత్వం ఇచ్చే సబ్బిడీ పూర్తిగా తగ్గించేస్తూ, ధరను అమాంతం పెంచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కో వినియోగదారునికి సబ్సిడీ సిలిండర్లను 12కే పరిమితం చేసింది. అర్హత గల గృహ వినియోగదారులు ఏడాదిలో 12 సిలిండర్లను పొందేందుకు మాత్రమే అర్హులు. ఆ తర్వాత బుకింగ్ చేసే సిలిండర్‌కు సబ్సిడీ వర్తించదు. ఎల్పీజీ ధరలు చాలా రెట్లు పెరిగినప్పటికీ, కొన్ని నెలలుగా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మాత్రం అలానే ఉంది. ప్రస్తుతం, హైదరాబాద్ నగరంలో సిలిండర్‌పై సబ్సిడీని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) రూపంలో కేవలం రూ.40.00లుగానే ఉంది. ఒకవైపు సిలిండర్ గ్యాస్ ధరను పెంచుతూ, అదే సమయంలో సబ్సిడీని ఒక్కసారిగా తగ్గించడం ఏమిటని పలువురు వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.
తక్కువ ధరకు ఫుడ్ సైప్లె కష్టం..
చాలా మంది యంగ్‌స్టర్స్ కొత్త కొత్త స్టార్టప్స్‌తో ఫుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. మేం కూడా రూ.50లకే తిన్నంత భోజనంతో హోటల్ నడుపుతు న్నం. అయితే, ఇప్పుడు గ్యాస్ ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుండటంతో చాలా కష్టం అవుతుంది. ఇంట్లో, కమర్షియల్ గ్యాస్ ధరల పెరుగుదల మాలాంటి వారికి ఇబ్బందే. తక్కువ ధర లో ఆహారాన్ని అందించాలంటే ఆలోచించాల్సి వస్తుం ది. అలా చేస్తే సామాన్యులు కొనుక్కోలేని పరిస్థితి.
– రాఘవ, హోటల్ నిర్వాహుకుడు;
సామాన్యుల పరిస్థితి ఏంగావాలె..
ఇంట్లో వంట గ్యాస్ తంట.. బయటకు వెళదామంటే పెట్రోలు మంట. ఎలా బతికేది? ఒక్క కూరతో రోజంతా సర్దుకోవాల్సిన దుస్థితి వచ్చింది. గ్యాస్ ధర లు పెరుగటంతో నచ్చిన ఆహార రుచులకు కూడా దూరమవుతున్నం. పిల్లలు కోరినవి తయారు చే యాలంటే కూడా ఆలోచిస్తున్నం. గ్యాస్ ధరలు పెరిగినయని పిల్లలకు నచ్చజెబుతున్నం. కేంద్ర ప్రభుత్వం పెరిగిన ధరలను తగ్గించకపోతే సామాన్యులు బతికే పరిస్థితి లేదు.
– మానస, గృహిణి;