అమీర్‌పేట్, ఏప్రిల్ 1 : మండుతున్న ఎండల్లో బాటసారుల కడుపు నింపేందుకు బీకేగూడ పార్కు వద్ద మిత భోజన శిబిరం త్వరలోనే ప్రారంభం కాబోతున్నది. ఏడు పదుల వయస్సు దాటుతున్న వయోధికులంతా కలిసి రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి డి.పార్థసారధి నేతృత్వంలో 2011లో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయగా.. కరోనా మహమ్మారి కారణంగా గడిచిన రెండేండ్లుగా మూత పడింది. తిరిగి ఈ నెల 5వ తేదీన శ్రీనివాస సమాజ సేవా చారిటబుల్ ట్రస్టు పేరుతో అర్ధాకలితో అలమటిస్తున్న బాటసారుల ఆకలి తీర్చేందుకు ముందుకు వస్తున్నది. ఈ శిబిరాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రారంభించనుండగా జూన్ 2వ తేదీ వరకు (53 రోజుల పాటు) కొనసాగుతుంది. ఈ శిబిరం ద్వారా ప్రతి రోజు 250 నుంచి 300 మంది ఆకలి తీర్చుకోనున్నారు.
దాతల చేయూతతో…
శ్రీనివాస సమాజ సేవా చారిటబుల్ ట్రస్ట్ పేరుతో వయోధికులమంతా కలిసి నిర్వహిస్తున్న ఈ ఉచిత మిత భోజన సేవకు దాతల నుంచి అందుతున్న చేయూత మరువలేనిది. మిత భోజనంలో చల్లటి మంచినీటితో పాటు సాంబార్ రైస్, జీరారైస్, పెరుగన్నం, అరటి పండు, మజ్జిగ, కారా బూంది, స్వీటు అందించనున్నాం. ప్రతిరోజు కనీసం 300 మంది ఆకలి తీరుస్తాం.
– డి.పార్థసారధి, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి