సిటీబ్యూరో, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : సమాజంలో చోటుచేసుకుంటున్న మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యవంతులను చేసేందుకు పోలీసులు నడుంబిగించారు. ఎఫ్ఐఆర్ ఆధారంగా సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుంటున్న పోలీసు కళా బృందం ‘ఏది నిజం.. ఏది మోసం’ అనేది కండ్లకు కట్టినట్లు ప్రదర్శన ద్వారా చూపిస్తున్నారు. మొత్తం పది అంశాలను స్కిట్ రూపంలో వివరిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గడిచిన నాలుగేండ్ల కాలంలో సైబరాబాద్ పోలీసు కళా బృందం 400 కళా ప్రదర్శనలు నిర్వహించి సుమారు 3.50లక్షల మందికి అవగాహన కల్పించి వారిచే ప్రతిజ్ఞ చేయించింది.
ఫోను మోజులో పడి
కూతురు చదువుకోసం తల్లిదండ్రులు స్మార్ట్ఫోన్ కొనిచ్చారు. దీంతో బాలిక ఫేస్బుక్లో ఖాతా తెరిచింది. గుర్తుతెలియని వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించగా అంగీకరించింది. అలా పరిచయమైన గుర్తుతెలియని వ్యక్తి బాలికను కలిసి ఓ స్మార్ట్ఫోన్ను బహుమతిగా ఇచ్చాడు. సంబుర పడిపోయిన బాలిక వెంటనే అతడితో సెల్ఫీలు దిగింది. కొద్ది రోజుల తర్వాత ఆ సెల్ఫీ ఫొటోలను మార్ఫింగ్ చేసి బాలికకు పంపించాడు. తన వద్దకు రావాలంటూ వేధించసాగాడు. అతడి వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్యకు యత్నించింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే మోసగాడి వయస్సు 40 కాగా..బాలిక వయస్సు 16. ఈ సంఘటన జడ్చర్లలో చోటు చేసుకుంది.
వాస్తవ సంఘటనను స్కిట్గా మార్చి
సైబరాబాద్ పోలీసు కళాబృందం ఈ వాస్తవ సంఘటనను స్కిట్గా మార్చి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఆన్లైన్, సైబర్ మోసాల పట్ల ప్రమత్తంగా ఉంటామని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.
అమనగల్లులో దయ్యం
అమనగల్లు మండల పరిధిలోని ఓ గ్రామం లో దయ్యం తిరుగుతున్నదని, ఆ కారణంగానే గ్రామస్తులకు పిల్లలు పుట్టడంలేదని పుకారు పుట్టింది. దీంతో ఆ గ్రామస్తులు ఓ భూత వైద్యుడిని సంప్రదించగా.. రాత్రి సమయంలోనే తిరుగుతున్నదని వారిలో మరింత భయాన్ని కల్పించాడు. చెట్ల పసరు తాగితే పిల్లలు పుడుతారని నమ్మించి పసరు తాగించగా.. మహిళలు కడుపునొప్పితో దవాఖాన పాలయ్యారు.
మంత్రం చదువగానే మంటలొచ్చి..
నిమ్మకాయలు కోయగానే అది ఎరుపు రంగులోకి మారిందని, కొబ్బరికాయ కొట్టగానే అందులో నుంచి పూలు, కుంకుమ, పసుపు వచ్చిందని, మంత్రం చదివి చల్లగానే మంటలు పైకి లేచాయని ఇదంతా దయ్యం మహిమేనని నమ్మించాడు. దీంతో నిజంగానే దయ్యం ఉందనే భావనతో గ్రామస్తులంతా ఆందోళనకు గురయ్యారు. భూతవైద్యుడు పూజల పేరుతో గ్రామస్తుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు.
కత్తికి ‘మందారం’ ఆకు పూస్తే..
ఈ విషయం తెలుసుకున్న సైబరాబాద్ కళా బృందం ఆ గ్రామంలో అడుగుపెట్టింది. మూఢనమ్మకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాయగాళ్లు చేసే మోసాలను గ్రామస్తులకు కండ్లకు కట్టినట్లు చూపించారు.
మందార ఆకుల రసం కత్తికి పూశారు. దాంతో నిమ్మకాయ కోయగానే ఎరుపు రంగులోకి మారుతుందని తెలిపారు.
కొబ్బరికాయ వెనకాల ఉండే మూడు రంధ్రాలను ముందుగా తొలగించి అందులో పూలు, కుంకుమ, పసుపు నింపి ఆ రంధ్రాలను మూసేస్తారు. ఆ తర్వాత అదే కొబ్బరికాయను ప్రజల ముందు కొడతారు. అప్పుడు అందులో నుంచి పూలు, పసుపు, కుంకుమ పడతాయి. ఇది చూపించి దయ్యం బూచి అని వివరించారు.
పొటాషియం పౌడర్, గ్లిజరిన్, తదితర రసాయనాలను కలిపి చల్లితే మంటలు చెలరేగుతాయి. వీటితోనే మంత్రగాళ్లు మాయ చేస్తారని తెలిపారు. ఇలా సుమారు రెండువేల మంది గ్రామస్తులకు అవగాహన కల్పించి మరోసారి మంత్రగాళ్లను నమ్మమని వారితో ప్రతిజ్ఞ చేయించారు.