మల్కాజిగిరి, ఏప్రిల్ 1: ఇండ్లలో వరుస చోరీలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఘరానా దొంగను పోలీసులు అరెస్టు చేసి..రిమాండ్‌కు తరలించారు. రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల గాంధీనగర్‌కు చెందిన ముచ్చు అంబేద్కర్(50) అలియాస్ రాజు ఇందిరా పార్కు వద్ద ఫుట్‌పాత్‌పై ఉంటున్నాడు. జల్సాలకు అలవాటు పడి డబ్బు కోసం ముప్పై ఏండ్ల కిందట కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో మొదటిసారిగా చోరీ చేశాడు. అప్పటి నుంచి దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు. తస్కరించిన ఆభరణాలను ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి వాటిపై రుణం పొందుతుంటాడు. అనేక సార్లు జైలుకు వెళ్లివచ్చినా..తీరు మార్చుకోలేదు. ఇతడిపై మొత్తం 43 కేసులున్నాయి. గురువారం ఉదయం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని వైదేహినగర్ వద్ద అంబేద్కర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 230 తులాల బంగారు, 10.2 కిలోల వెండి ఆభరణాలు, రూ.15,300 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.1.30 కోట్లు ఉంటుందని సీపీ తెలిపారు.