సిటీబ్యూరో, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరంలో నిర్మాణ రంగం కళకళలాడుతున్నదని అధికార యంత్రాంగం పేర్కొన్నది. ఇందుకు సంబంధించి 2021-22వ ఆర్థిక సంవత్సరంలో 17,572 నిర్మాణ అనుమతుల ద్వారా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగానికి రూ.1144.08 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు శుక్రవారం తెలిపారు. ఇందులో 83 హైరెజ్డ్ భవనాలు ఉన్నట్లు పేర్కొన్నారు. వీటితో పాటు 1550 ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు పేర్కొన్నారు. కాగా, 2020-21వ ఆర్థిక సంవత్సరంలో 11538 పర్మిషన్లు ఇవ్వగా, వీటి ద్వారా రూ.661 కోట్లు వచ్చిందని, ఓసీలు 1574 జారీ చేసినట్లు తెలిపారు. 2020-21వ ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2021-22వ సంవత్సరంలో 73 శాతం మేర ఆదాయం పెరిగినట్లు టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరం విశ్వనగరంగా ఎదుగుతున్న తరుణంలో ప్రభుత్వ ప్రోత్సాహకాలతో నిర్మాణ రంగం గణనీయంగా వృద్ధి పథంలోకి దూసుకుపోతున్నదని, మంత్రి కేటీఆర్ మార్గదర్శకంలో రియల్ రంగం ప్రగతి సాధించిందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెబుతున్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా రియల్ రంగం చెక్కుచెదర లేదని, టీఎస్ బీ పాస్ ద్వారా నిర్మాణ రంగ అనుమతులు సులభతరం అయ్యాయని పేర్కొన్నారు.