సిటీబ్యూరో, మార్చి 22 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ సామాన్యుడికి భారీ షాక్ ఇచ్చింది. ఒకే రోజు పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు ఇంట్లో వాడే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే పెట్రోల్ ధర సెంచరీ దాటి రూ.108. 20లు ఉండగా, తాజాగా లీటరు పెట్రోల్‌కు 91 పైసలు, డీజిల్‌పై 88 పైసలు పెంచింది. ఇంతటితో సరిపోదన్నట్లుగా ఎల్పీజీ సిలిండర్‌పై ఏకంగా రూ.50లు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఒకే రోజు ఇంధన ధరలు మోత మోగడంతో నగరవాసులు లబోదిబోమంటున్నారు.
వెయ్యి దాటిన సిలిండర్
రూ.952గా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర తాజా పెంపుతో రూ. 1000లు దాటింది. గ్యాస్ సిలిండర్లపై ప్రభుత్వ సబ్బిడీ పూర్తిగా తగ్గించేస్తూ, ధరను అమాంతం పెంచేస్తున్నారు. అర్హత గల గృహ వినియోగదారులు ఏడాదిలో 12 సిలిండర్లను పొందేందుకు మాత్రమే అర్హులు. ఆ తర్వాత బుకింగ్ చేసే సిలిండర్‌కు సబ్సిడీ వర్తించదు. ఎల్పీజీ ధరలు చాలా రెట్లు పెరిగినప్పటికీ కొన్ని నెలలుగా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలో మాత్రం ఏ మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో సిలిండర్ పై సబ్సిడీని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) రూపంలో కేవలం రూ.40 గానే ఉంది. ఒకవైపు సిలిండర్ గ్యాస్ ధరను పెంచుతూ, అదే సమయంలో సబ్సిడీని ఒక్కసారిగా తగ్గించడం ఏమిటని పలువురు వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.
5 రాష్ర్టాల ఎన్నికలు కాగానే..
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉత్తరాదిలోని 5 రాష్ర్టాల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో 137 రోజులుగా పెట్రో ధరలు, ఎల్పీజీ సిలిండర్ ధరలను పెంచలేదు. ఇటీవలే ఎన్నికలు ముగియడంతో మళ్లీ ఒక్కసారిగా ఇంధన ధరల మోత మోగించింది. ఎన్నికల సమయంలో ధరలు పెంచితే తమపై వ్యతిరేకత వస్తుందని, ఓట్లు పడవనే ఉద్దేశంతో ధరలు పెంచకుండా ఆపివేసి, ఎన్నికలు ముగిసిన తర్వాత ఒక్కసారి పెద్ద మొత్తం పెంచడం ప్రజలను మోసం చేయడమేనని పలువురు ఆరోపిస్తున్నారు.
మేమూ ఊహించలేదు..
కేంద్రం పెట్రో ధరలను ఒక్కసారిగా పెంచుతుందని ఊహించలేదు. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్దం నేపథ్యంలో మొదట బ్యారెల్ ధర పెరిగినా, ఆ తర్వాత క్రమంగా మళ్లీ తగ్గిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే మార్కెట్ క్రూడాయిల్ ధరలు తగ్గాయి. అయినా కేంద్ర ప్రభుత్వం మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు ఒకేసారి 91 పైసలు పెంచడమంటే సామాన్యుల భారమే.
– రాజీవ్ అమరం, పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధి
తగ్గుతాయనుకుంటే.. పెంచేశారు
ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయనుకున్నాం. ఆశ్యర్యకరంగా కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా వాటి ధరలను పెంచేసింది. ప్రజలపై భారం మోపే ముందు కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. అమాంతం పెరిగిన పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు సామాన్య, పేద ప్రజలకు శాపంగా మారుతున్నాయి.
– కళ్యాణ్, ప్రైవేట్ ఉద్యోగి