మేడ్చల్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కండ్లకోయలో నిర్మించనున్న గేట్‌వే ఐటీ పార్క్ నిర్మాణానికి త్వరలోనే టెండర్లను ఆహ్వానించనున్నారు. ఇప్పటికే సిద్ధం చేసిన డిజైన్ ప్రకారం టెండర్లను ఆహ్వానించేందుకు ప్రణాళికను టీఎస్ఐఐసీ అధికారులు సిద్ధం చేశారు. రూ.250 కోట్లు.. 6 లక్షల చదరపు అడుగులు.. 14 అంతస్తుల రెండు టవర్లను నిర్మించనున్నారు. ఇప్పటికే గేట్‌వే ఐటీ పార్క్‌లో వివిధ దేశాలకు చెందిన 90 కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. మరో 40 కంపెనీలు కూడా రిజిస్ట్రేషన్‌కు ముందుకొచ్చాయి. త్వరలోనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు టీఎస్ఐఐసీ ఎండీ వెంకట నర్సింహారెడ్డి తెలిపారు. ఈ ఐటీ పార్క్ భూమి పూజకు ముందే 90 కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. దీంతో, ప్రస్తుతం నిర్మించనున్న 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సరిపడా కంపెనీలు వచ్చాయి. అయితే, అదనంగా మరో 40 కంపెనీలు కూడా రిజిస్ట్రేషన్‌కు ముందుకొచ్చాయి. ఈ నేపథ్యంలో భవన నిర్మాణ విస్తీర్ణంలో అదనంగా మరిన్ని చదరపు అడుగులు పెంచి, తాజా ప్రణాళికలను సిద్ధం చేయాలన్న యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం.