సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ఇక మీదట ట్రాఫిక్ సిబ్బంది నలుదిక్కులా నజర్ పెట్టనున్నారు. టెక్నాలజీతో నిబంధనలు పాటించని వాహనదారుల పని పట్టనున్నారు. ఇందులో భాగంగానే కెమెరాల స్థానంలో వారికి ట్యాబ్‌లు అందజేస్తున్నారు. వీటి ఆధారంగా ఉల్లంఘన చిత్రీకరణ చేశాక.. వెంటనే సర్వర్లోకి అప్లోడ్ చేసేందుకు వీలు కలుగుతుంది.
నాన్ కాంటాక్టు పద్ధతిలో ఉల్లంఘనలను గుర్తించేందుకు ట్రాఫిక్ సిబ్బంది కెమెరాలతో ఫొటోలు తీస్తున్నారు.. ఇక వాటి స్థానంలో ట్యాబ్‌లు కనిపించనున్నాయి. అంతేకాదు.. ఉల్లంఘనల చిత్రాలు ఇక నుంచి లొకేషన్ ఆధారంగా వెంటనే సర్వర్‌లో అప్లోడ్ కానున్నాయి. ట్యాబ్‌ల్లో ఉండే జీపీఎస్ ఆధారంగా ఫలాన చోట ఉల్లంఘనను రికార్డు చేస్తే.. ఎక్కడ గుర్తించారనే విషయం లొకేషన్ ద్వారా తెలుస్తుంది. దీనివల్ల ఒకేచోట కాకుండా..వివిధ ప్రాంతాల్లో ఉల్లంఘనలను క్లిక్ మనిపించే అవకాశముంటుంది. ఈ నూతన విధానం వల్ల సిబ్బందిలో మరింత జవాబుదారితనం పెరుగడంతో పాటు..వాహనదారులూ పక్కాగా నిబంధనలు పాటించేందుకు ఆస్కారం ఉంటుందని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఒకే చోట కాకుండా..
కెమెరాతో సిబ్బంది ఒకే చోట ఉంటూ..ఉల్లంఘనలు రికార్డు చేస్తారు. ఆ తరువాత పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి.. వాటిని అప్లోడ్ చేస్తుంటారు. సిబ్బందికి ట్యాబ్‌లు ఇవ్వడం ద్వారా జీపీఎస్ ఆధారంగా లొకేషన్ తెలియడంతో పాటు ఉల్లంఘనలు వెనువెంటనే నేరుగా సర్వర్‌లో అప్లోడ్ అయ్యేందుకు వీలు కలుగుతుంది. ఇప్పటికే సిటీ ట్రాఫిక్ సిబ్బందికి 175 ట్యాబ్‌లను ఇవ్వగా, త్వరలో మరిన్ని అందజేయనున్నారు. మరోవైపు నూతన విధానంలో కానిస్టేబుల్‌కు కేటాయించిన ప్రాంతంలో అన్ని కూడళ్లు, రోడ్లను పరిశీలించాలి. నిబంధనలు పాటించని వాహనదారులను గుర్తించి.. ఫొటోలను తీయాలి. అప్పుడు సిబ్బంది ఏ లోకేషన్ నుంచి ఎన్ని ఉల్లంఘనలు చిత్రీకరించాడనే విషయంపై స్పష్టత వస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగిందంటే..అక్కడ సిబ్బంది ఉన్నారా? ఎన్ని గంటలకు అక్కడున్నారు..? ప్రమాదం ఎప్పుడు జరిగింది అనే విషయాలు కూడా తెలుస్తాయి. అంతేకాకుండా ఇప్పటివరకు ఎక్కువగా ద్విచక్రవాహనాలపై దృష్టి పెట్టారు. ఇకమీదట కార్లు, భారీ వెహికిల్స్‌పై ప్రత్యేక నజర్ పెట్టి..నిబంధనలను పాటించని వారిని గుర్తించాలని ఉన్నతాధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
సిబ్బందికి ట్యాబ్‌లు
ఉల్లంఘనలను నాన్ కాంటాక్టు పద్ధతిలో చిత్రీకరించే సిబ్బందికి ట్యాబ్‌లు అందజేస్తున్నాం. ఉల్లంఘనలు ఎక్కడి నుంచి తీస్తున్నారనే లొకేషన్ రికార్డు అవుతుంది. దీని వల్ల సిబ్బంది అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ.. నిబంధనలు పాటించని వాహనదారులను గుర్తిస్తారు. దీనివల్ల సిబ్బందిలో మరింత జవాబుదారితనం పెరుగుతుంది. అంతేకాదు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేందుకు అవకాశముంటుంది. ద్విచక్రవాహనాలపైనే ఫోకస్ కాకుండా అన్ని వాహనాలపై నిఘాను పటిష్టం చేస్తున్నాం. బ్లాక్ ఫిల్మ్, అనర్హులు వాడే ఎమ్మెల్యే, పోలీసు, ప్రెస్ వంటి స్టిక్కర్లు, సరిగ్గా నంబర్ ప్లేట్ లేని వెహికిల్స్‌పై ప్రస్తుతం స్పెషల్ డ్రైవ్ కొనసాగుతున్నది.
– ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ జాయింట్ సీపీ