ఇది ఎలక్ట్రిక్ వాహనాల యుగం…
సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ): వాహనదారులు ఇంధన రహిత వాహనాల వైపు చూస్తున్నారు. ఓ వైపు పర్యావరణ పరిరక్షణ.. మరోవైపు పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా ప్రత్నామ్నాయాలను అన్వేషిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులుగా ఈవీ వాహనాల వినియోగానికి మొగ్గు చూపుతున్నారు. తెలంగాణలో ఈవీ వాహనాల కొనుగోలుకు సర్కార్ పెద్దపీట వేయడమే ఇందుకు కారణం. ప్రత్యేక రాయితీలు కల్పించడంతో వాహనదారుల నుంచి విశేష స్పందన వస్తుంది. గ్రేటర్లో ఇప్పటి వరకు 11,950 ఈవీ వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. చార్జింగ్ కోసం ఎలక్ట్రిక్ స్టేషన్లు కూడా నగరంలో అక్కడక్కడ కొలువుదీరడం.. మరికొన్ని కంపెనీలు ప్రత్యేక యాప్ల సాయంతో ఈవీ చార్జింగ్ స్టేషన్ల వివరాలు అందిస్తుండటంతో వాహనదారులకు ఈవీ వినియోగం సులభతరంగా మారింది.
అంతా ఈవీ మయం..
ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న ఇంధన భారంతో నగరవాసులు తమ ద్వి, త్రి, ఫోర్ వీలర్ ఇంధన వాహనాలను ఈవీ వాహనాలుగా మార్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. నగరంలో బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాలు 5,655, హైబ్రిడ్ డీజిల్ ఎలక్ట్రిక్ వాహనాలు 4108, హైబ్రిడ్ పెట్రోల్ ఎలక్ట్రిక్ వాహనాలు 2196 ఉన్నాయి. గతంతో పోలిస్తే ఈవీ వాహనాల సంఖ్య నెమ్మదిగా పెరుగుతుంది. 2016లో 25 బ్యాటరీ వాహనాలు ఉండగా క్రమక్రంగా వాటి సంఖ్య పెరుగుతూ వస్తోంది. నగరంలో టీఎస్ఆర్టీసీ కూడా 40 ఎలక్ట్రిక్ వాహనాలను ఆపరేట్ చేస్తుంది.
ఈవీకి దన్నుగా సర్కార్
ప్రభుత్వ నిబంధనల ప్రకారం తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పాలిసీ-2020-2030లో భాగంగా తొలి 2 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు 100 శాతం రోడ్ ట్యాక్స్ మాఫీ. రిజిస్ట్రేషన్ కూడా ఉచితం. అలాగే తొలి 20 వేల మూడు చక్రాల వాహనాలు, తొలి 10 వేల ఎలక్ట్రిక్ లైట్ గూడ్స్ క్యారియర్ వాహనాలు, తొలి 5వేల ప్రైవేట్ కార్లు, తొలి 5వేల కమర్షియల్ ఫోర్ వీలర్ వాహనాలకు, మొదటి 500 ఎలక్ట్రిక్ బస్సులకు రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ వంద శాతం ఉచితం.