మేడ్చల్, మార్చి 20 (నమస్తేతెలంగాణ) : దళితబంధు లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్ల వారీగా డిటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌లను ప్రత్యేక అధికారులు సేకరిస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో దళితబంధు పథకానికి 561 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారు ఎంపిక చేసుకున్న యూనిట్లపై ఉన్న అవగాహనను తెలుసుకుంటూ ప్రాజెక్ట్ రిపోర్టు(డీపీఆర్‌లు)తీసుకుంటున్నారు. ఈ నెల 30 వరకు లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లను అందించే విధంగా ప్రణాళికను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
వ్యాపార విస్తరణకు అవకాశం
దళిత కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి ప్రవేశపెట్టిన దళితబంధు పథకం కింద ప్రస్తుతం కొనసాగిస్తున్న వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. అనుభవం ఉన్న వ్యాపారాలను ఎంపిక చేసుకుని ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని కోరుతున్నారు. వ్యాపార నిర్వహణకు అవసరమైన లైసెన్స్‌లు, జీఎస్టీ ఇప్పించే బాధ్యతలను అధికారులే తీసుకుంటున్నారు. యూనిట్లకు సంబంధించి కొనుగోలు చేస్తున్న వస్తువులకు వారంటీ, రిప్లేస్మెంట్ సర్వీస్ ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకంటున్నారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు సేకరణ
ఎంపిక చేసుకున్న యూనిట్లకు సంబంధించి కలెక్టర్ ఆదేశాల మేరకు లబ్ధిదారుల నుంచి ప్రాజెక్ట్ రిపోర్ట్‌లను సేకరించే పనిలో ఉన్నాం. ఎంచుకున్న యూనిట్లపై వారికి అవగాహన ఉందా ? లేదా ? అన్న విషయాన్ని దళితబంధు ప్రత్యేక అధికారులు తెలుసుకుని అవసరమైతే అవగాహన కలిగిస్తారు. ఈ నెల 25 వరకు ప్రాజెక్ట్ రిపోర్ట్‌లను సేకరించి ఈ నెల 30 లోపు యూనిట్లను అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. యూనిట్లకు సంబంధించి లైసెన్స్‌లను అందించే బాధ్యతను అధికారులు తీసుకుంటారు. దళితబంధు పథకంలో ఎంపికైన లబ్ధిదారులు ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు.
– బాలాజీ, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి