మాట్లాడాలి
ఎక్కడో ఒకచోట ఒకసారైనా
మనం గొంతు విప్పి మాట్లాడాలి
నిజాన్ని నిగ్గుతేల్చమని
నిరాహార దీక్షవుతున్నచోటో
పిడికిళ్లు బిగించి
గుండె గొంతుకలో
ఎగసిపడుతున్న చోటో
కాళ్లకింద నేల జారిపోయి
కలలు కూలిపోతున్నచోటో
ఎక్కడో ఓ చోట
మాటల తూటాలను ప్రయోగిస్తూ
కొత్త యుద్ధం మొదలెట్టాల్సిందే
మాట్లాడాల్సిన చోట
మాట్లాడాల్సిన వాళ్లు
మాటల పొట్లం విప్పి
చైతన్యపు సుమగంధమై
సుడిగాలిలా వీయాల్సిన వాళ్లు
మౌనపు మంచు బిందువులోకి
గడ్డకట్టుకుపోయి చలనరహితమైతే
మాట్లాడగూడని వాళ్ల మాటలే
మురికినీటి నదులై
మనుషుల అంతరంగాల వీధుల్ని
ముంచెత్తి మురికిమయం చేస్తాయి
మాట్లాడాల్సిన వాళ్లు
మాటల విత్తులు నాటుకుంటూ పోతేనే
ఈ మానవ సమాజం
పచ్చని పంటచేలై పరిఢవిల్లుతుంది
మౌనం బద్ధలైనచోటే
న్యాయం తిరిగి మొలకెత్తుతుంది
గురిచూసి వదిలిన
వడిసెల రాళ్లు మాటలు మాట్లాడాలి!