సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో హైటెక్ సిటీ కారిడార్‌కు ఓ ప్రత్యేకత ఉన్నది. నగరం నలుమూలల నుంచి ఐటీ కారిడార్‌ను అనుసంధానం చేసే ఈ కారిడార్ రాకతో ఐటీ ఉద్యోగులకు వరంగా మారింది. ఈ కారిడార్‌లో మెట్రో రైలు సేవలను ప్రారంభించి మూడేండ్లు గడిచాయి. 2019, మార్చి 20న అమీర్‌పేట నుంచి హైటెక్ సిటీ వరకు 8 కిమీ దూరం ఉండే ఈ కారిడార్‌ను అప్పటి గవర్నర్ ఈఎస్ఎల్. నరసింహన్ ప్రారంభించారు. అయితే, మెట్రో రైలు సేవలను మొట్ట మొదటిసారిగా 2017, నవంబర్ 29న ప్రధాని నరేంద్ర మోదీ నాగోల్ – అమీర్‌పేట, అమీర్‌పేట నుంచి మియాపూర్ కారిడార్ల పరిధిలో ప్రారంభించారు. ఆ తర్వాత రెండో దశలో అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్ వరకు, మూడో దశలో అమీర్‌పేట నుంచి హైటెక్ సిటీ వరకు ప్రారంభించారు. దీంతో ఐటీ కారిడార్‌తో మెట్రో రైలు అనుసంధానమైన తర్వాత మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2020, మార్చి 20 వరకు (కరోనాకు ముందు) ప్రతి రోజూ మెట్రో రైలులో సుమారు 4.20లక్షల మంది ప్రయాణించారు. తాజాగా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోంకు స్వస్తి చెబుతూ వర్క్‌ఫ్రం ఆఫీస్ విధానానికి మారుతున్నాయి. ఈ క్రమంలో మళ్లీ మెట్రో రైలులో ఐటీ ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో ప్రయాణించే అవకాశం ఉన్నదని మెట్రో అధికారులు చెబుతున్నారు.
దశల వారీగా ప్రారంభమైన మెట్రో కారిడార్లు..
2017, నవంబర్ 29న నాగోల్ – అమీర్‌పేట కారిడార్- 3 (16.8 కి.మీ), అమీర్‌పేట – మియాపూర్ కారిడార్-1(11.3 కి.మీ )
2018, సెప్టెంబర్ 24న ఎల్బీనగర్- అమీర్‌పేట 16.8 కి.మీ. కారిడార్- 1
2019, మార్చి 20న అమీర్‌పేట- హైటెక్ సిటీ మార్గం 8.5 కి.మీ. కారిడార్-3
2019, నవంబర్ 29న హైటెక్ సిటీ- రాయిదుర్గం 1.5 కి.మీ. కారిడార్- 3
2020, ఫిబ్రవరి 7న జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ 11 కి.మీ. కారిడార్- 2