సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ): మీ ఇంట్లో అవసరం లేని వస్తువులు ఉన్నాయా? అవి మీకు అక్కర్లేదా..?అయితే ఇష్టారాజ్యంగా ఎక్కడపడితే అక్కడ పడేయకండి..మేమే మీ ఇంటి వద్దకు వచ్చి ఆ వస్తువులను తీసుకువెళ్తామంటూ జీహెచ్ఎంసీ ముందుకు వచ్చింది. పాత బట్టలు, ఫర్నీచర్, పాడైన టీవీలు, ప్రిడ్జిలు, ఏసీలు, వాషింగ్ మిషిన్లు, పాత పుస్తకాలు, సామాన్లూ ఇలా మీకు అవసరం లేని వస్తువులు ఏవైనా ఉన్నా ప్రత్యేక వాహనాల్లో జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఇందు కోసం తొలుత కాలనీలు, బస్తీల్లో పర్యటించి అక్కడి పెద్దలతో జీహెచ్ఎంసీ అధికారులు సమావేశమవుతున్నారు. పాత వస్తువుల సేకరణకు సంబంధించి ముందస్తు సమాచారం ఇచ్చి మరుసటి రోజు ప్రత్యేక వాహనాలను సమకూర్చి సంబంధిత వ్యర్థాలను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు.
వాస్తవంగా ప్రతి ఏటా నాలా పూడికతీత పనులు జరుపుతున్నప్పుడు పెద్ద ఎత్తున పాత పరుపులు, చాపలు, చెద్దర్లు , ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు, గాజుముకలు బయటడపడుతున్నాయి. వీటితో పాటు కొబ్బరి బోండాలు, గ్లూకోజ్ డబ్బాలు, గంటెలు, స్పూన్లు, చట్నీ గిన్నెలు, ఇసుక, ఇటుక, భవన నిర్మాణ వ్యర్థాలైన చిన్న చిన్న బండరాళ్లు, ప్లాస్టిక్ డబ్బాలు, ఇతర వ్యర్థాలు ఎకువగా దర్శనమిస్తున్నాయి. మురుగునీటి ప్రవాహం సాఫీగా జరిగేలా చేయడం, స్వచ్ఛ సర్వేక్షణ్-2022లో నగరానికి మెరుగైన ర్యాంకింగ్ లక్ష్యంగా పాత వస్తువుల సేకరణపై అధికారులు స్పెషల్ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టారు. శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్, ఎల్బీనగర్ జోనల్లో ఈ స్పెషల్ డ్రైవ్‌ను ముమ్మరం చేశారు. పాత వస్తువుల సేకరణతో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపర్చడం, ప్రజల్లో విస్తృత అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.