సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ చదువుతున్న ఓ యువతి ఫోన్‌కు అసభ్యకరమైన సందేశాలు రావడం.. ఆమె ఫొటోలు మార్ఫింగ్ చేసి.. బ్లాక్‌మెయిలింగ్ చేస్తుండడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తులో వేధిస్తున్న వ్యక్తి ఎవరో కాదు.. ఆమెకు గతంలో పరిచయం ఉన్న వ్యక్తేనని తేలింది. ఇలా సోషల్‌మీడియాలో వెలుగులోకి వచ్చే వేధింపుల వ్యవహారాలు ఎక్కువగా తెలిసిన వారే చేస్తుండటం విస్మయానికి గురిచేస్తున్నది.
రకరకాల కారణాలతో…
నేడు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ఫోన్లు.. అందులో సోషల్‌మీడియా యాప్స్ ఉంటున్నాయి. అందులో తెలిసిన వారు, కొత్తవారితో పరిచయాలు ఏర్పడడంతో కొన్నాళ్లు మాట్లాడడం, ఆ తరువాత ఏవో కారణాలతో విబేధాలు వచ్చి విడిపోవడం జరుగుతున్నాయి. అక్కడే వేధింపుల పర్వం ప్రారంభమవుతున్నది. స్నేహంగా ఉన్నప్పుడు అన్ని విషయాలు చర్చించుకోవడం..ఫొటోలు తీసుకోవడం చేస్తుంటారు. అనుకోని విధంగా విభేదాలు ఏర్పడితే అవే ఇబ్బందులను సృష్టిస్తున్నాయి.
విదేశాల నుంచి సైతం..
మైనర్లు, యువత, మహిళలతో పాటు పురుషులు కూడా సోషల్‌మీడియాలో వేధింపులకు గురవుతున్నారు. స్నేహం, ప్రేమ, పెండ్లి, ఆస్తులు, ఆర్థికపరమైన విభేదాలు ఏర్పడినప్పుడు వేధింపులు మొదలవుతున్నాయి. టార్చర్ పెట్టేందుకు నకిలీ ఐడీలను నిందితులు వాడుతున్నారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు కొన్ని సందర్భాల్లో విదేశాల నుంచి వేధింపులు చేసే వారు కూడా ఉన్నారు. పగ తీర్చుకోవడమే లక్ష్యంగా వారి విలనిజం ఉంటున్నది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు భిన్న రకాలైన ఫిర్యాదులు అందుతుంటాయి. అందులో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్‌ల నుంచి జరిగే వేధింపులే ఎక్కువగా వస్తున్నాయి. నిందితులు బాధితుల ప్రొఫైల్ ఫొటోలను తీసి, వాటిని మార్ఫింగ్ చేస్తున్నారు. అందుకే సోషల్‌మీడియాలో తమ వ్యక్తిగతమైన చిత్రాలను బహిరంగంగా ఉంచడం వల్ల ఇబ్బందులు ఏర్పడే ప్రమాదముందని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఫొటోల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.