సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి19(నమస్తే తెలంగాణ): మనకు డబ్బులు కావాలంటే గతంలో బ్యాంకుకు వెళ్లి డ్రా చేసుకునేవాళ్లం. ఇప్పుడైతే ఏ సమయంలోనైనా పక్కనే ఉన్న ఏటీఎంలో క్షణాల్లో డ్రా చేసుకుంటున్నాం. మరి.. బంగారం కావాలంటే ఏం చేస్తాం?! కచ్చితంగా ఆభరణాల దుకాణానికో.. అందుబాటులో ఉన్న స్వర్ణకారుల వద్దకో వెళుతున్నాం. ఇక కొన్ని రోజుల్లో ఆ అవసరం లేకుండా పోనుంది. రోజులో ఏ సమయంలోనైనా క్షణాల్లో బంగారాన్ని కొనుగోలు చేసే సౌకర్యం అందుబాటులోకి రానుంది. అదీ.. ఏటీఎం సెంటర్లలో డబ్బులు డ్రా చేసుకున్నట్లుగా.. ఎనీటైం గోల్డ్ (ఏటీజీ) సెంటర్లలో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు. హైదరాబాద్ మహా నగరంలో రోజుకు వంద కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. అందుకేనేమో గోల్డ్ సిక్కా ప్రతినిధులు దేశంలోనే నగరాన్ని కేంద్రంగా చేసుకున్నారు. ఇప్పటివరకు కేవలం రెండు దేశాల్లోనే అందుబాటులో ఉన్న ఈ ఏటీజీ సెంటర్లు దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు గోల్డ్ సిక్కా కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. ఇంకేముంది… ఇగ… ‘కార్డు పెట్టు… బంగారం పట్టు’ అన్నమాట!
ప్రత్యేక స్మార్ట్ కార్డులతో కావాల్సినంత…
ఎనీటైం గోల్డ్ సెంటర్లు.. డబ్బులు డ్రా చేసుకునే ఏటీఎం కేంద్రాల మాదిరిగానే ఉంటాయి. అందులో ఏర్పాటు చేసే మిషన్‌లో గరిష్టంగా ఐదు కిలోల వరకు బంగారాన్ని నాణేల రూపంలో వివిధ పరిమాణంలో అందుబాటులో ఉంచుతారు. 0.5 గ్రాములు మొదలు… 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల్లో బంగారు నాణేలను అందుబాబాటులో ఉంచుతారు. అందులోని బంగారాన్ని డ్రా చేసుకునేందుకుగాను గోల్డ్ సిక్కా కంపెనీ ప్రత్యేకంగా స్మార్ట్ కార్డులను జారీ చేస్తుంది. ఏటీఎం కేంద్రాల్లో మనం కార్డు పెట్టగానే… డ్రా చేసే మొత్తం ఆధారంగా రూ.100, 200, 500, 2000 నోట్లు ఎలా వస్తాయో.. ఏటీజీల్లో కూడా స్మార్ట్ కార్డు పెట్టి మనకు ఎంత కావాల్నో అంత సూచిస్తే… అంత బంగారం మిషన్ నుంచి విడుదల అవుతుంది. ఈ స్మార్ట్ కార్డులు ప్రీ పెయిడ్, పోస్టు పెయిడ్ విధానంలో ఉంటాయి. కార్డులో ఉన్న మొత్తానికి లోబడి మనం బంగారు నాణేలు డ్రా చేసుకోవచ్చు. కాగా బంగారం ధర జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో హెచ్చుతగ్గులు ఉంటుంది. దానికి అనుగుణంగా ఏటీజీ కేంద్రాల్లోని యంత్రాల స్క్రీన్‌పై ఎప్పటికప్పుడు ఆ సమయానికి ఉన్న బంగారం ధర డిస్ప్లే అవుతుంది. బంగారం డ్రా చేసుకోవడంలోనూ యంత్రం అదే రేటును పరిగణనలోనికి తీసుకుంటుంది. ఇందులో హాల్ మార్కింగ్, ఐఎస్ఐ ధ్రువీకరణ పత్రాలతో పాటు బంగారాన్ని అందుబాటులో ఉంచుతామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
భవిష్యత్తులో డెబిట్, క్రెడిట్ కార్డులతోనూ…
ఏటీఎం కేంద్రాల్లో డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి డబ్బులు తీసుకున్నట్లుగానే భవిష్యత్తులో ఏటీజీల్లోనూ డెబిట్, క్రెడిట్ కార్డులనూ ఉపయోగించి బంగారు నాణేలను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తామని కంపెనీ నిర్వాహకులు తెలిపారు. ప్రాథమికంగా గోల్డ్ సిక్కా కంపెనీ స్మార్ట్ కార్డులను విక్రయిస్తుండగా, మున్ముందు దేశంలోని అన్ని బ్యాంకులకు సంబంధించిన డెబిట్, క్రెడిట్ కార్డులను వినియోగించేలా ఆర్బీఐ నుంచి అనుమతులు తీసుకొని, బ్యాంకులతో ఒప్పందం చేసుకునేందుకు కంపెనీ కసరత్తు చేస్తున్నది.
మొదటి సారిగా నగరంలోనే…
దేశంలోనే మొట్ట మొదటి సారిగా హైదరాబాద్ నగరంలో మూడు చోట్ల గోల్డ్ ఏటీఎంను ఏర్పాటు చేసేందుకు గోల్డ్ సిక్కా సంస్థ సన్నాహాలు చేస్తోంది. కార్డుల ద్వారా బంగారం నాణాలను డ్రా చేసుకునే ఏటీఎంలు ఇప్పటివరకు దుబాయ్‌లో రెండు, లండన్‌లో 4-5 చోట్ల మాత్రమే ఉన్నాయని.., ఆ తర్వాత తాము ఏర్పాటు చేయబోయేవే తాజా ఎనీటైం గోల్డ్ సెంటర్లు అని గోల్డ్ సిక్కా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రతాప్ తెలిపారు. రానున్న నెల రోజుల్లో నగరంలోని సికింద్రాబాద్, అబిడ్స్, చార్మినార్, గుల్జార్ హౌస్ ప్రాంతాల్లో ఒకేసారి మూడు ఎనీటైం గోల్డ్ (ఏటీజీ) సెంటర్లను ప్రారంభించనున్నట్లు చెప్పారు. అనంతరం, దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లో మూడువేల ఏటీజీ సెంటర్ల ఏర్పాటు లక్ష్యంగా ఎంచుకున్నామని వెల్లడించారు.
భూగర్భంలో ఏర్పాటు…
విస్తారంగా ఏటీఎం కేంద్రాలు ఉన్నప్పటికీ వాటి భద్రత అనేది పెద్ద సవాలే. మరి నగదు విషయంలోనే ఇలా ఉంటే, కిలోల కొద్దీ బంగారం ఉండే ఏటీజీ కేంద్రాల భద్రత అనేది పెను సవాలే. ఈ నేపథ్యంలో ఏటీజీ కేంద్రాల ఏర్పాటులో సంబంధిత కంపెనీ అనేక రక్షణ చర్యలు తీసుకుంటుంది. ఏటీఎం మిషన్లు పని చేసినట్లుగానే ప్రత్యేక సాఫ్ట్వేర్ ఆధారంగా ఏటీజీ కేంద్రాల్లోని యంత్రాలు పని చేస్తాయి. అయితే సాధారణ ఏటీఎం మిషన్లను భూమిపైన అమర్చితే… ఏటీజీ మిషన్లను మాత్రం కొంత భాగాన్ని భూమిలోపల ఉండేటట్లుగా ఏర్పాటు చేయనున్నారు. తద్వారా యంత్రాన్ని తీయడమనేది కష్టం. దీనికి తోడు భద్రత కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించే ట్రూనిక్స్ డేటావేర్, కేఎల్ హైటెక్ వంటి కంపెనీలతో భాగస్వామ్యమై ఏటీజీ యంత్రాలను తయారు చ్తేన్నారు. ఇందులో చెన్నైకి చెందిన ట్రూనిక్స్ డేటావేర్ కంపెనీ సాఫ్ట్వేర్ సేవలను అందిస్తుండగా, కేఎల్ హైటెక్ సెక్యూర్ ప్రింట్ సంస్థ అత్యంత భద్రతతో కూడిన ప్రింట్ ఉత్పత్తులను, స్మార్ట్ సేవలను అందిస్తాయి.