సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ): వర్షాకాలంలో నిర్వహించే తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి అవసరమయ్యే మొక్కలను అందుబాటులో ఉంచేందుకు హెచ్ఎండీఏ కార్యాచరణ చేపట్టింది. ఇందుకోసం కోటిన్నరకు పైగా మొక్కలను హెచ్ఎండీఏకు చెందిన నర్సరీల్లో పెంచుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఏడు జిల్లాల్లో విస్తరించిన హెచ్ఎండీఏ పరిధిలో పచ్చదనం పెంపొందించేందుకు అర్బన్ ఫారెస్ట్రీ విభాగం కీలకంగా పనిచేస్తున్నది. నగరం నలుమూలలా ఉన్న హెచ్ఎండీఏ 34 నర్సరీలలో మొక్కలు పెంచుతున్నారు.
రకరకాల మొక్కలు..
గ్రేటర్ చుట్టూ 158 కి.మీ. మేర ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు ఇంటర్చేంజ్ల వద్ద హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం నర్సరీలను ఏర్పాటు చేసింది. అక్కడ వివిధ జాతులకు చెందిన మొక్కలను పెంచుతున్నారు. ప్రధానంగా రాగి, మర్రి, గుల్ మొహర్, నెమలి నార, నందివర్ధనం, పొగడ, పర్కియా, జామ, ఈత, వేప, బాదం, కానుగ, గన్నేరు, చింత, బోగన్విల్లా, వెలగ, సంపంగి, మందారం.. వంటి దాదాపు 100 రకాల మొక్కలను పెంచి పెద్ద చేశారు. వాటిని ఏడు జిల్లాల పరిధిలోని ప్రభుత్వ సంస్థలకు, స్థానిక ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచారు.