సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ): తీవ్ర ఎండల కారణంగా గ్రేటర్‌కు మరో రెండు రోజుల పాటు వడగాలుల ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో గురువారం కంటే శుక్రవారం పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. అయితే, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు దగ్గరగా నమోదు కావడంతో పగలు సమయంలో జనం రోడ్లపైకి రావడానికి జంకుతున్నారు. దీంతో మధ్యాహ్నం సమయంలో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. గురువారం నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 39.6డిగ్రీలు నమోదు కాగా, శుక్రవారం 39.2డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.8డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గురువారంతో పోల్చితే శుక్రవారం నమోదైన రాత్రి ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం బంగాళా ఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ 2 డిగ్రీలు పెరగడంతో రాత్రి సమయంలో ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. గాలిలో తేమ 33 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.