మేడ్చల్, మార్చి 18(నమస్తే తెలంగాణ): ఇంగ్లిష్ మీడియం విద్యా బోధనపై మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఈ నెల 21 నుంచి 9 వారాల పాటు శిక్షణను అందించనున్నారు. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ విద్యా బోధన అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇంగ్లిష్ మీడియం బోధించేందుకు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు చెందిన 2102 ఉపాధ్యాయులకు సన్నద్ధం చేయనున్నారు. అజీజ్ ప్రేమ్‌జీ యూనివర్సీటికి చెందిన రిసోర్స్ పర్సన్స్, మెంటర్స్ ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. మొదటి దశలో ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు 12 కేంద్రాలలో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 28 నుంచి 5 రోజుల పాటు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు 8 కేంద్రాలలో శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ 9 వారాల పాటు దశల వారీగా కొనసాగుతుందని, ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ శిక్షణ కొనసాగుతుందని విద్యా శాఖ అధికారులు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి భాషేతర ఉపాధ్యాయులను మినహాయించి ఉపాధ్యాయులందరిని సన్నద్ధం చేసేలా రూపొందించిన ప్రణాళికను అమలు చేయనున్నారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో 176 పాఠశాలలకు మౌలిక సదుపాయలు కల్పించేందుకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
వచ్చే విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయలు సిద్ధం కావాలి
ఈ నెల 21 నుంచి 9 వారాల పాటు భాషేతర ఉపాధ్యాయులందరికి శిక్షణ కొనసాగనుంది. ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ శిక్షణ ఇచ్చే విధంగా విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా మొదటి దశలో పాఠశాలల అభివృద్ధికి 176 పాఠశాలలను ఎంపిక చేశాము. 2102 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నాం.
– విజయ కుమారి, విద్యాశాఖ అధికారి,మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా
‘హైదరాబాద్’లోనూ శిక్షణకు సన్నాహాలు
హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ ఇంగ్లిష్ మీడియంలో బోధనా పద్ధతులపై శిక్షణను ఇవ్వనున్నట్టు జిల్లా విద్యా శాఖ అధికారి రోహిణి తెలిపారు. రెండు విడతలుగా జిల్లాలో ఈ నెల 21 నుంచి 25 వరకు శిక్షణ తరగతులు కొనసాగనున్నాయి. ఈ మేరకు తొలి విడుత శిక్షణ కార్యక్రమాలు తొమ్మిది వారాలు, రెండో విడుత శిక్షణకు త్వరలోనే మరో షెడ్యూల్ విడుదల కానుంది. అయితే హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 16 కేంద్రాలలో టీచర్లకు ఇంగ్లిష్‌లో బోధనపై శిక్షణ ఇవ్వడానికి అన్ని రకాల చర్యలు కొనసాగిస్తున్నట్లు డీఈవో రోహిణి తెలిపారు. దశల వారీగా టీచర్లందరికీ శిక్షణ కార్యక్రమాలు ముగించి, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఇంగ్లిష్ మీడియంలో బోధన జరిగేలా చర్యలు చేపడుతున్నట్టు డీఈవో తెలిపారు.