శేరిలింగంపల్లి, మార్చి 18 : హోలీ పండుగ మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. హోలీ వేడుకలకు హాజరై తిరిగివస్తున్న క్రమంలో అతివేగంతో అదుపుతప్పిన ఓ కారు సృష్టించిన బీభత్సంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… నారాయణపేట్ జిల్లా నాల్వా మండలం లంకల గ్రామానికి చెందిన నాయకుని మహేశ్వరి (38) కుటుంబ సభ్యులతో కలిసి నగరానికి వలస వచ్చింది. గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్స్‌లో తోటపని చేస్తూ హోటల్స్ వెనుక నివాసం ఉంటుంది. శుక్రవారం సాయంత్రం హిల్రిడ్జ్ ఎల్లా హోటల్ ప్రధాన ద్వారం ముందు ఉన్న రహదారిపై మొక్కలకు మహేశ్వరి నీళ్లు పడుతున్నది. అదే సమయంలో హోలీ వేడుకలు ముగించుకుని విప్రో చౌరస్తా నుంచి ట్రిపుల్ ఐటీ జంక్షన్ వైపు వెళ్తున్న కారు మితిమీరిన వేగంతో దూసుకువచ్చి హిల్రిడ్జ్ ఎల్లా హోటల్ ప్రధాన గేటు ముందు అదుపుతప్పి ఫుట్‌పాత్ మీద బోల్తా పడుతూ మహేశ్వరిని ఢీకొని ఆగిపోయింది.
ఈ ప్రమాదంలో మొక్కలకు నీళ్లు పడుతున్న మహేశ్వరి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. కారులో హెచ్ఎంటీ హిల్స్ ఆదిత్యహోమ్స్లో నివాసం ఉండే వ్యాపారి డి.రోహిత్ , అతడి స్నేహితురాలు, జూనియర్ ఆర్టిస్ట్‌గా పని చేస్తున్న కేపీహెచ్‌బీ కాలనీ నివాసి ఎస్.గాయత్రి (26) ఉన్నారు. కారు బోల్తా పడటంతో గాయత్రి కారులో నుంచి ఎగిరి బయట పడి తీవ్రంగా గాయపడింది. కారు నడుపుతున్న రోహిత్ సైతం తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించగా, గాయత్రి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రోహిత్ పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంలో మృతి చెందిన మహేశ్వరి, గాయత్రి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు గచ్చిబౌలి
పోలీసులు తెలిపారు.