సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 15 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ చుట్టూ అభివృద్ధి వందల కిలోమీటర్ల మేర గ్రామాల్లోకి నగర జీవనం విస్తరిస్తున్నది. వివిధ రంగాల్లో దూసుకుపోతున్న అభివృద్ధితో వాటి పరిధిలోని భూములు సిరులు కురిపిస్తున్నాయి. విద్య, వ్యాపార, ఐటీ, పారిశ్రామిక తదితర రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఏర్పాటుతో వెలిసిన ఆకాశహర్మ్యాలతో ఆ ప్రాంతాలన్నీ కళకళలాడుతున్నాయి. కానీ… నగరానికి చెంతనే ఉన్నా, కొన్ని గ్రామాల్లోకి మాత్రం ఈస్థాయి అభివృద్ధి వెలుగులు ప్రసరించలేకపోతున్నాయి. వాటి పరిధిలోని భూములు ఆ ప్రాంత రైతుల గుండెల్లో భరోసా నింపలేకపోతున్నాయి. సకల వనరులు… రవాణా సదుపాయాలు ఉన్నప్పటికీ ఆంక్షల కత్తి వేలాడుతుండటంతో పెట్టుబడులూ రావడం లేదు. ఆ గ్రామాల యువతకు స్థానిక ఉపాధి లభించడం లేదు.
అవే… 111 జీవో పరిధిలోని 84 గ్రామాలు!!
111 జీవో గ్రహణంతో రెండున్నర దశాబ్దాలకు పైగా అభివృద్ధి అందని ద్రాక్షగా మారిన ఈ గ్రామాల్లో… మంగళవారం శాసనసభ వేదికగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఆశల్ని చిగురింపజేసింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి ఇచ్చిన భరోసా ఇన్నేండ్ల నిరుత్సాహాన్ని పారదోలి, సంతోషాన్ని నింపింది.
అనంతగిరి కొండల్లో పుట్టి హైదరాబాద్ నగరం మీదుగా కృష్ణమ్మ ఒడికి చేరుకునే మూసీ 1908లో చూపిన ఉగ్రరూపంతో తదుపరి వరద నియంత్రణకు నిజాం రాజు జంట జలాశయాలను నిర్మించారు. మూసీపై ఉస్మాన్‌సాగర్ (గండిపేట), ఈసీపై హిమాయత్‌నగర్ జలాశయాల నిర్మాణంతో వరదలను నియంత్రించడంతో పాటు జంట నగరాలకు తాగునీటిని కూడా అందించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. అనంతరం దశాబ్దాల పాటు ఈ జంట జలాశయాలు, జంట నగరాల్లోని ప్రజల దాహార్తిని తీర్చాయి. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన నగర తాగునీటి వ్యవస్థతో ముడిపడి ఉన్న ఈ జలాశయాల పరిరక్షణకు 1996, మార్చి 8న అప్పటి ప్రభుత్వం జీవో 111 జారీ చేసింది. రెండు జలాశయాల పరివాహక ప్రాంతాలు కాంక్రీట్ జంగిల్లా మారకుండా ఉండేందుకు పది కిలోమీటర్ల వ్యాసార్థంలోని 84 గ్రామాల్లో ఈ ఆంక్షలను విధించారు. ప్రధానంగా విస్తీర్ణంలో కేవలం పది శాతంలో మాత్రమే శాశ్వత నిర్మాణాలు చేపట్టేందుకు ఇక్కడ అనుమతి ఉంది. గ్రామాల పరిధిలో చేసే లేఅవుట్లలోనూ 60 శాతం మేర ఓపెన్ స్పేస్, రోడ్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీంతో జీవో111 పరిధిలోకి వచ్చే 84 గ్రామాల పరిధిలోని 1,32,600 ఎకరాలు కేవలం వ్యవసాయ, వినోద (రెసిడెన్షియల్, రిక్రియేషన్) జోన్లుగా మాత్రమే వినియోగించే పరిస్థితి నెలకొన్నది.
అసెంబ్లీలో 111 జీవో ఎత్తివేత ప్రకటనతో సంబురాలు
రెండున్నర దశాబ్దాలుగా ఆ గ్రామాల్లో నిలిచిన అభివృద్ధి
ఐటీ, పారిశ్రామిక భూముల కేటాయింపునకు తొలగనున్న అవరోధం
వాస్తవానికి చారిత్రక జంట జలాశయాల నుంచి హైదరాబాద్‌కు రోజుకు 40 మిలియన్ గ్యాలన్ల నీటి సరఫరా ఉండేది. ఉస్మాన్‌సాగర్ నుంచి 15 ఎంజీడీలు, హిమాయత్‌సాగర్ నుంచి 22 ఎంజీడీలు వచ్చేవి. గతంలో ఈ జలాశయాల నుంచి నీటి సరఫరా లేకుంటే నగరం అల్లాడిపోయేది. ఎగువ నుంచి వరద లేక జలాశయాలు ఎండిపోతే… నగరంలోని మెహిదీపట్నం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, రెడ్‌హిల్స్ వంటి ప్రాంతాల్లో తాగునీటి సరఫరా ఉండేది కాదు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ హైదరాబాద్ తాగునీటి సరఫరాకు సంబంధించి రానున్న దశాబ్దాల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యవస్థను ఏర్పాటు చేశారు. కృష్ణా నది నుంచి మూడు దశల్లో రోజుకు 270 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలించే వ్యవస్థకు ఎలాంటి ఢోకా లేకుండా ఉండేలా సుంకిశాల పథకాన్ని పూర్తి చేస్తున్నారు.
మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మ సాగర్ నుంచి కేశవాపురం వద్ద భారీ రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. దీంతో అటు కృష్ణా… ఇటు గోదావరి నుంచి పుష్కలమైన నీటి లభ్యత ఉండటంతో సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా వందేళ్లకు కూడా హైదరాబాద్ తాగునీటి వ్యవస్థకు ఢోకా ఉండదు. ఇలా నగర మంచినీటి వ్యవస్థ పటిష్టం కావడంతో చారిత్రక జంట జలాశయాల నుంచి నగర తాగునీటి సరఫరా అవసరం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే 111 జీవోను ఎత్తివేస్తామంటూపై మంగళవారం శాసనసభ వేదికగా ప్రకటన చేశారు. దీంతో ఆ 84 గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది.
నిలిచిపోయిన అభివృద్ధి..
రంగారెడ్డి జిల్లా పరిధిలోని మొయినాబాద్, శంషాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, గండిపేట మండలాల పరిధిలోని 84 గ్రామాల్లో 1996 నుంచి జీవో 111 ఆంక్షలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర అభివృద్ధి నలువైపులా విస్తరించినప్పటికీ… నగరానికి నైరుతిలో ఉన్న ఈ 84 గ్రామాల్లో మాత్రం విస్తరణ నిలిచిపోయింది. ప్రధానంగా ఐటీ, పారిశ్రామిక రంగాల్లోని సంస్థల ఏర్పాటుకు ఇక్కడ అవకాశం లేకపోవడంతో ఈ ప్రాంతాన్ని దాటి అభివృద్ధి విస్తరించింది. మరోవైపు రియల్ రంగం అనేది హైదరాబాద్ చుట్టూ వంద కిలోమీటర్ల మేర విరాజిల్లుతున్నా… జీవో 111 పరిధిలోని 84 గ్రామాల్లో మాత్రం విస్తరించలేకపోయింది. నగరం చుట్టూ ఉన్న భూముల రేట్ల ప్రకారం బేరీజు వేస్తే… ఇతర ప్రాంతాల్లో పది అంతకంటే ఎక్కువ రెట్ల విలువలు ఉన్నాయి. ఈ క్రమంలో లక్షలాది మంది రైతులు అత్యవసర సమయాల్లోనూ మంచి రేటుకు తమ భూముల్ని విక్రయించుకునే పరిస్థితి లేకుండా పోయింది. జీవో 111 గ్రహణంతో నిరుత్సాహంలోకి వెళ్లిన 84 గ్రామాల ప్రజల్లో 2018 ఎన్నికల సందర్భంగా చేవెళ్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభ జీవం పోసింది. ఈ సభలో సీఎం కేసీఆర్ ‘111 జీవోను ఎత్తివేస్తాం’ అని ప్రకటించడంతో ఆ గ్రామాల్లోని రైతుల్లో ఆశలు చిగురించాయి.
ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం
111జీవో ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. లోక్‌సభ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ 111జీవో కారణంగా సుమారు 84గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లో జీవోను ఎత్తివేస్తామని మాట ఇచ్చి…ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం హర్షనీయం. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ప్రజల తరుపున సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నాను.
– గడ్డం రంజిత్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ
స్వాగతిస్తున్నాం..రంగారెడ్డి జిల్లాలో 84 గ్రామాలకు గుదిబండగా మారిన 111 జీవో ఎత్తివేతకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడం స్వాగతించదగ్గ పరిణామం. గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని పూర్తి చేయటానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. న్యాయపరమైన ఇబ్బందులు అధిగమించి దశలవారీగా జీవో సడలింపు చేపడుతామని సీఎం ప్రకటించడం హర్షనీయం. ఆయా గ్రామాల ప్రజల తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు.
– విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి
జీవో 111 పరిధిలోని 7 మండలాలు, గ్రామాలు
మొయినాబాద్ మండలం (26 గ్రామాలు) అజీజ్‌నగర్, ఎంకట్పల్లి, ముంతాజ్గూడ, సజ్జన్పల్లి, సురంగల్, నయీబ్నగర్, బంగళ్లగూడ, నాగిరెడ్డిగూడ, బాకారంజాగీర్, అమ్దాపూర్, దర్గత్ద్రుల, వెంకటాపురం, హిమాయత్‌నగర్, చిల్కూర్, చందానగర్, మేడిపల్లి, చిన్నమంగళారం, మోత్కుపల్లి, రెడ్డిపల్లి, పెద్ద మంగళారం, చిన్న షాపూర్, తోల్కట్ట, ఎత్‌మార్‌పల్లి, కేతిరెడ్డిపల్లి, కనకమాడి, రామంజాపూర్
శంషాబాద్ మండలం (37 గ్రామాలు)
మల్కారం, కోల్బావిదొడ్డి, సుల్తాన్‌పల్లి, కాచారం, రాయన్నగూడ, చౌదరిగూడ, నర్కుడ, అమ్మపల్లి, హరిగూడ, కొత్వాల్‌గూడ, శంషాబాద్, కిషన్‌గూడ, ఊట్పల్లి, తొండుపల్లి, దేవతబౌలి, మకన్పల్లి, కవేలిగూడ, మంగిపూర్, జుకల్, గండిగూడ, పెద్దషాపూర్, మదన్‌పల్లి, పాలమాకుల, గంగిరాయిగూడ, చెర్లగూడ, హమీదుల్లానగర్, ఓశెట్టిగూడ, గౌలపల్లిఖుర్ద్, రషీద్‌గూడ, సయ్యద్‌గూడ, గొల్లపల్లి కలాన్, బహదూర్‌గూడ, గోల్కొండ ఖుర్డ్, శంకరాపూర్, సంగిగూడ, గోల్కొండ కలాన్, కావత్రిగూడ
రాజేంద్రనగర్ మండలం (3 గ్రామాలు)
ఖానాపూర్, గుంగుర్తి, వట్టి నాగులపల్లి
శంకర్పల్లి మండలం (7 గ్రామాలు)
జన్వాడ, దత్తంపల్లి, మహరాజ్‌పేట, గోపులారం, ప్రొద్దుటూర్, టంగుటూరు, బుల్కాపూర్
చేవెళ్ల మండలం (8 గ్రామాలు)
ఎన్కెపల్లి,యెర్లపల్లి,కన్మెట,గొల్లపల్లి,రావియపల్లి,ముడిమ్యాల్, కుమ్మెర,మల్కాపూర్
కొత్తూరు మండలం
(ఒక గ్రామం)
ఎత్తివేతతో ఇవీ ప్రయోజనాలు..
84 గ్రామాల పరిధిలో 111 జీవో
ఎత్తివేతతో నగరానికి
ఆనుకొని ఉన్న ఇతర ప్రాంతాల్లో
మాదిరిగా అభివృద్ధి
పరుగులు పెడుతుంది.
ఇప్పటివరకు కేవలం వ్యవసాయ, వినోద జోన్లకు మాత్రమే పరిమితమైన ఈ భూములు
అన్ని జోన్ల పరిధిలోకి వస్తాయి. రైతులు తమ భూముల్ని నివాస, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు
వినియోగించుకునే వెసులుబాటు వస్తుంది. తద్వారా భూముల విలువ ఇప్పటికంటే అనేక
రెట్లు పెరుగుతుంది.
ప్రత్యేక మాస్టర్‌ప్లాన్ కావాలి
111 జీవో పరిధిలో ఉన్న 84 గ్రామాలు గ్రీన్జోన్లో ఉన్నాయి. హైదరాబాద్ భవిష్యత్ అభివృద్ధికి అనుగుణంగా ఈ గ్రామాల పరిధిలో ఉన్న 538 చదరపు కి.మీ విస్తీర్ణానికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. దానిని హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌తో అనుసంధానం చేయాలి. దాని వల్ల మహానగరాన్ని మరింత విస్తరించేందుకు అవకాశం ఉంటుంది. ఆ ప్రాంతాల్లో చాలా చోట్ల ఫామ్‌హౌస్‌లు నిర్మించారు. వాటిని క్రమబద్ధీకరించాలి. కొత్త మాస్టర్‌ప్లాన్‌లో పర్యావరణ పరిరక్షణతో పాటు అభివృద్ధి సమపాళ్లలో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది.
– తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జీ.వీ.రావు
ప్రధానంగా ఉద్యోగ,ఉపాధి అవకాశాలకుఈ ప్రాంతాలు కేంద్రంగా మారతాయి.
పెట్టుబడులకు కేంద్రంగా మారడంతో ఇతర అన్ని రకాల మౌలిక వసతులు ఆప్రాంతాల్లోకి
వస్తాయి.
అన్ని రంగాల్లో వచ్చే సంస్థల ఏర్పాటుతో 84 గ్రామాల పరిధిలో అనేక కంపెనీలు, పరిశ్రమలు, సంస్థలు వస్తాయి.ఆకాశహర్మ్యాలు వెలుస్తాయి.
నగరానికి చేరువలో ఉండటంతో ఆంక్షల ఎత్తివేతతో నగరానికి వచ్చే జాతీయ, అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులకు ఈ గ్రామాలు వేదికగా మారుతాయి.
ఆంక్షలు లేకుండా మిగతా ప్రాంతాల్లాగానే నిర్మాణ రంగానికి అనుమతులు వస్తాయి.