సిటీబ్యూరో, మార్చి 15(నమస్తే తెలగాణ): అర్హులైన ఉద్యోగార్థులకు భృతి కల్పించాలనే ప్రధాన ధ్యేయంతో గోల్డెన్ జూబ్లీ సందర్భంగా జేఎన్టీయూ వరుసగా ఉద్యోగ, ఉపాధి, సెమినార్ వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. అందులో భాగంగా జేఎన్టీయూ హైదరాబాద్‌లో మంగళవారం ప్రారంభించిన రెండు రోజుల మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన వచ్చింది. ఈ జాబ్ మేళాను ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి ప్రారంభించారు.
దాదాపు 20 వేలకు పైగా విద్యార్థులు, నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం జాబ్‌మేళాకు హాజరైట్లు ఆ యూనివర్సిటీ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ సురేశ్ తెలిపారు. సాల్వెక్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ (ఎస్ఎస్డీసీ), తెలంగాణ అకాడమి ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీఈఈటీ)తో కలిసి జేఎన్టీయూ నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి 150 కంపెనీలు పాల్గొన్నాయి. ఆయా కంపెనీలలో దాదాపు 10 వేలకు ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే, ఈ ఉద్యోగాలు పొందడానికి 20 వేలకు పైగా నిరుద్యోగ యువత పాల్గొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ యూనివర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ గోవర్ధన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్, ఎస్ఎస్డీసీ సీఈవో పీ లక్ష్మీరావు, యూనివర్సిటీ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెంటర్ డైరెక్టర్ ఎస్.తారా కల్యాణి తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి ఫర్ స్టేట్ ఎస్.వేణుగోపాలచారి ప్రత్యేకంగా పాల్గొన్నారు. అయితే, బుధవారం కూడా జాబ్‌మేళా కొనసాగుతుందని, ఈ కార్యక్రమానికి నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆ యూనివర్సిటీ వీసీ పిలుపునిచ్చారు.
నైపుణ్యాలను పెంపొందించుకోవాలి: జేఎన్టీయూహెచ్ వైస్ చాన్స్‌లర్ కట్టా నరసింహారెడ్డి
కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 15: నైపుణ్యాలను పెంపొందించుకున్నప్పుడే మెరుగైన సంస్థలలో ఉద్యోగాలు పొందవచ్చని జేఎన్టీయూహెచ్ వైస్ చాన్స్‌లర్ కట్టా నరసింహారెడ్డి అన్నారు. జేఎన్టీయూహెచ్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా వర్సిటీ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెంటర్ (యూఐఐసీ), సోల్వీక్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ (ఎస్ఎస్డీసీ), తెలంగాణ అకాడమి ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి (టా స్క్), డిజిటల్ ఎంప్లాయిమెంట్ సంయుక్త ఆధ్వర్యంలో వర్సిటీ ఆవరణలో మెగా జాబ్‌మేళాను నిర్వహించారు. ఈ మేళాను వర్సిటీ వీసీ కట్టా నరసింహారెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిరుద్యోగ యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. సాఫ్ట్వేర్, మ్యాన్‌ఫ్యాక్చరింగ్, ఫార్మా, బ్యాకింగ్ రంగాల్లో విస్తృత అవకాశాలున్నాయని, ఆయా రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించుకుంటే మంచి ఉద్యోగాలు పొందవచ్చన్నారు. జాబ్‌మేళాలలో ఆయా కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి వెంటనే ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందని, ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాబ్‌మేళాలలో 150 కంపెనీలు పాల్గొనగా 10 వేల మంది యూజీ, పీజీ, డిప్లమా అర్హత కలిగిన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో రెక్టార్ ఏ.గోవర్ధన్, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, ఎస్ఎన్డీసీ సీఈవో పి.లక్ష్మీరావు, యూఐఐసీ డైరెక్టర్ తారా కల్యాణి, డిప్యూటీ డైరెక్టర్ జె.సురేశ్ కుమార్ పాల్గొన్నారు.