మేడ్చల్, మార్చి 15(నమస్తే తెలంగాణ): దళిత బంధు పథకానికి సంబంధించి ఈ నెల 25వ తేదీలోగా పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ చేయాలని, ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం దళితబంధు పథకం అమలుపై అధికారులతో కలెక్టర్ హరీశ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని, ఈ పథకంతో దళితులు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 561 మంది లబ్ధిదారులను గుర్తించి వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరిపించామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ పథకంలోని వారందరూ 44 రకాల వ్యాపారాలు చేసుకునేందుకు ముందుకు వచ్చారని వాటిలో ప్రధానంగా పాడి పరిశ్రమ పౌల్ట్రీ, గొర్రెల పెంపకం, ఫెర్టిలైజర్స్, సెంట్రింగ్, ట్రస్ట్ హౌస్, హార్వెస్టర్, ట్రాక్టర్, రవాణ వాహనాలు, ఫొటో వీడియో, స్టూడియోలు తదితర యూనిట్లు నెలకొల్పేందుకు మక్కువ చూపుతున్నారని తెలిపారు. ఈ నెల 20వ తేదీలోగా డీపీఆర్లను 25వ తేదీలోగా పూర్తిస్థాయిలో గ్రౌండింగ్ చేసి అప్పగించాలని అధికారులకు ఆదేశించారు.
నైపుణ్యతను అధికారులు పరిశీలించాలి
దళితబంధు లబ్ధిదారులు యూనిట్ల ఏర్పాట్లలో వారికి ఉన్న నైపుణ్యత, అవగాహన వంటి వివరాలను అధికారులు తెలుసుకోవాలని కలెక్టర్ హరీశ్ అధికారులకు సూచించారు. పథకం కింద ఒకేసారి పది లక్షల తో వ్యాపారాలు ప్రారంభించాల్సిన అవసరం లేదని, యూనిట్లను బట్టి ముందుగా కొన్ని లక్షలతో వ్యాపా రం ప్రారంభించి పుంజుకున్న తర్వాత మిగతా డబ్బులతో వ్యాపారాన్ని విస్తరించుకోవాలని సూచించారు. ప్రస్తుతం, కొనసాగుతున్న వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం దళితబంధులో ఉందని తెలిపారు. యూని ట్ల ఏర్పాటులో వారికి అవసరమయ్యే సౌకర్యాలు ఉ న్నాయా? లేదా? అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అధికారులపై ఉందని తెలియజేశారు. యూ నిట్ల ఏర్పాటులో వారికి లైసెన్స్లు ఇచ్చే బాధ్యత అధికారులపైనే ఉందని అన్నారు. యూనిట్లు గ్రౌండింగ్ అయిన తర్వాత కనీసం ఆరు మాసాల పాటు మానిటరింగ్ చేయాలని, అప్పుడే యూనిట్లు విజయవం తం అవుతాయని కలెక్టర్ హరీశ్ తెలిపారు.