సికింద్రాబాద్, మార్చి 15: ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని బెదిరించి నగలు కాజేసిన నిందితుడిని బేగంపేట్ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం నార్త్ జోన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ చందనా దీప్తి మాట్లాడుతూ.. మల్కాజిగిరి గౌతమ్నగర్కు చెందిన సబ్బు గణేష్ (35) సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో స్వీపర్‌గా పనిచేస్తున్నాడు. గత కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. ఈనెల 14న బేగంపేట్ రసూలపురలోని ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని మంచినీళ్లు కావాలని అడిగి ఆమె మెడకు వైర్‌తో బిగించి దాడి చేశాడు. మెడలో ఉన్న ఐదు తులాల బంగారు గొలుసును తీసుకుని ఊడాయించాడు. బాధితురాలు వెంటనే బేగంపేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్రమత్తమైన బేగంపేట్ పోలీసులు సీసీ పుటేజీలను పరిశీలించి నిందితుడి ఆచూకీ తెలుసుకొని సబ్బు గణేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. నిందితుడు వృద్ధ్దురాలి నుంచి కాజేసిన ఈ నగలను మల్కాజిగిరిలో ఉంటున్న శ్రీరాజ్ పాన్ బ్రోకర్‌కు రూ.50 వేలకు విక్రయించాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడి నుంచి రూ. 49,600 నగదు, ఐదు తులాల బంగారు నగల్ని స్వాధీనం చేసుకోగా నగలు కొనుగోలు చేసిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇద్దరు నిందితుల అరెస్ట్
నగల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను మార్కెట్ పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్‌కు చెందిన జ్యోతి మాధవి మోండా మార్కెట్‌కు వెళ్లి వస్తుండగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న అల్ఫా హోటల్ సమీపంలో మహారాష్ట్రకు చెందిన అశోక్ (44), గోవింద్ మనోజ్ (27), కన్నయ్య కిషన్ (51)లు ఆమె వద్దకు వచ్చి సంతానం కోసం చేసిన పూజ ప్రసాదం అని మత్తు మందు ఇచ్చి ఆమె నుంచి ఏడు తులాల బంగారు గొలుసును దోపిడీ చేసి పారిపోయారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంటనే అప్రమత్తమైన మార్కెట్ పోలీసులు సీసీ పుటేజీలను పరిశీలించారు. అల్ఫా హోటల్ సమీపంలో నిందితుడు అశోక్ ఆనవాళ్లు సీసీ పుటేజీలో కనిపించగా వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని డీసీపీ చెప్పారు. నిందితుడి నుంచి ఏడు తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించగా పరారీలో ఉన్న ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.