ముషీరాబాద్, మార్చి 15: ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధాని మోడీ ప్రభుత్వం గుండు గుత్తగా అమ్మేస్తున్నదని ఐఎఫ్టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ప్రదీప్ అన్నారు. బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం జరిగిన భారత కార్మిక సంఘాల సమాఖ్య సమావేశంలో రెండు రోజుల పాటు చేపట్టనున్న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కామ్రేడ్ అరుణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రదీప్ మాట్లాడారు. కార్పొరేట్ కంపెనీలకు ప్రధాని మోడీ ప్రభుత్వం మేలు చేసే నిర్ణయాలను నిరసిస్తూ ఈ నెల 28, 29వ తేదీలతో నిర్వహించతలపెట్టిన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ నాయకులు పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ వర్గాల ప్రతినిధిగా పని చేస్తున్నదని, ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో ప్రజలు, కార్మికులకు ప్రయోజనకరమైన ఏ ఒక్క చట్టం చేయలేదని మండిపడ్డారు. సహజ వనరులు, ప్రభుత్వ రంగ పరిశ్రమలను గుండు గుత్తగా అమ్మేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.శ్రీనివాస్, ఆర్.జనార్దన్, ప్రతినిధులు అరుణ, మణెమ్మ, అనసూయ, సరోజా, గీత, మహేందర్‌లు పాల్గొన్నారు.