మేడ్చల్ కలెక్టరేట్, మార్చి 15: పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర సభ్యురాలు రాగజ్యోతి అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా మహిళా, శిశు సంక్షేమ, దివ్యాంగుల, సీనియర్ సిటిజన్ శాఖల ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలు, డ్రగ్స్ మరియు లైగింక వేధింపుల నివారణపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హరీశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆమె విచ్చేశారు. ఈ సందర్భంగా రాగజ్యోతి మాట్లాడుతూ.. బాలల చట్టాల అమలు, వారికి మాదకద్రవ్యాలు, డ్రగ్స్ విషయంలో జరిగే నష్టాలపై పూర్తి అవగాహన కల్పించాలని అన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు కమిషన్ కృషి చేస్తున్నదని తెలిపారు. 100 శాతం అక్షరాస్యత సాధించే దిశగా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కువ సంఖ్యలో విద్యా సంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు ఉన్నాయని తెలిపారు. డ్రగ్స్, మాదకద్రవ్యాలు వాడకుండా పోలీసులు నిఘా ఏర్పాటు చేయాలని, యువతులను వేధింపులకు గురి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర గౌరవ సభ్యులు దేవయ్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నివారణ చర్యలను వివరించారు. ఈ సమావేశంలో డీడబ్య్లూఓ అక్కేశ్వరరావు, రాచకొండ, సైబరాబాద్ ఎసీపీలు, ఎక్సైజ్ సూపరింటెండెంట్, సీఐలు, పోలీసు అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, సీడీపీఓలు, కార్మిక, విద్యాశాఖ, ఐసీడీఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.