మియాపూర్, మార్చి 15 : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో పేద, మధ్య తరగతి ప్రజలు ఏండ్ల తరబడి ఇండ్లు నిర్మించుకుని నివసిస్తున్న వారికి విద్యుత్ మీటర్లు ఇవ్వడంలేదని దీనివల్ల అటు ప్రజలకు ఇటు విద్యుత్‌పై భారంతో ఇబ్బందులు నెలకొంటున్నాయని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు శాసనసభ సమావేశాల్లో భాగంగా మంగళవారం జీరో అవర్‌లో ఈ సమస్యపై మాట్లాడటంతో పాటు శాశ్వత పరిష్కారం చూపాలని మంత్రి కేటీఆర్, జగదీశ్‌రెడ్డిని కోరారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. మన నగరం కార్యక్రమంలో భాగంగా ఇండెమ్నిటీ బాండ్‌తో మీటర్లు, ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వాలని కేటీఆర్ పేర్కొన్నారని, ఏడాది పాటు మాత్రమే ఇచ్చారన్నారు. ఒకే ట్రాన్స్ఫార్మర్, మీటరుపై కనెక్షన్లు ఇస్తుండటం వల్ల కాలిపోతూ రోజుల తరబడి విద్యుత్ అంతరాయం కలుగుతున్నదన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 300 వరకు ట్రాన్స్ఫార్మర్లు అవసరం ఉన్నదని గాంధీ శాసనసభలో ప్రస్తావించారు.
ప్రజల ఇబ్బందులును దృష్టిలో పెట్టుకుని సమస్యను పరిష్కరించి శాశ్వత పరిష్కారం చూపాలని విప్ గాంధీ కోరారు. స్పందించిన మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందిస్తూ సమస్యను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.