కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 15 : వర్షంనీటి నాలా విస్తరణ పనులను వేగవంతం చేయాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. మంగళవారం జోన్ ఆఫీస్‌లో ఇరిగేషన్ శాఖాధికారులతో ఎస్ఎన్డీపీ పనులు పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో చేపట్టిన నాలా విస్తరణ పనులను వేగవంతం చేయాలన్నారు. బాటిల్‌నెక్ ప్రాంతాలలో నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న భవనాలను, ఇతర నిర్మాణాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న వర్షాకాలంలో ముంపు సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కోరారు. నాలాలలో పూడికతీత పనులను త్వరగా పూర్తి చేయాలని, ఆయా ప్రాంతాల్లో నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ చిన్నారెడ్డి, ఈఈ ఇరిగేషన్ నారాయణ, ఈఈ గోవర్దన్ తదితరులు ఉన్నారు.
వందశాతం ఆస్తిపన్నులను సాధించాలి..
వార్షిక యేడాది ఆస్తిపన్ను లక్ష్యాన్ని వందశాతం చేరుకునేలా చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. మంగళవారం జోన్ కార్యాలయంలో ఐదు సర్కిళ్ల ఉప కమిషనర్లు, రెవెన్యూ విభాగం అధికారులతో ఆస్తిపన్ను వసూళ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో వార్షిక యేడాది డిమాండ్ రూ.465.58 కోట్లు ఉండగా ప్రస్తుతానికి రూ.218.16 కోట్లు వసూళ్లయ్యాయని ఇంకా రూ.265 కోట్లు వసూళ్లు చేయాల్సి ఉందన్నారు. కోర్టు కేసులు, ఇతరాత్ర కారణాలతో పెండింగ్‌లో ఉన్న ఆస్తిపన్నులను మినహాయించి మిగిలిన ఆస్తిపన్నులను వందశాతం వసూళ్లు చేయాలన్నారు. సర్కిళ్లు, డాకెట్ల వారీగా రోజువారీ లక్ష్యాలను నిర్దేశించాలని, మొండి బకాయిలు, దీర్ఘకాలిక బకాయిలపై దృష్టిసారించాలన్నారు. చెక్‌బౌన్స్‌లపై దృష్టిసారించి ఆ పన్నులను వెంటనే వసూళ్లు చేయాలన్నారు. పన్ను చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికి నోటీసులు జారీ చేయాలన్నారు. స్పందించకుంటే ఆస్తులను జప్తు చేయాలని సూచించారు. ప్రజలంతా సకాలంలో ఆస్తిపన్నులు చెల్లించి నగరాభివృద్ధిలో భాగస్తులు కావాలని కోరారు. కార్యక్రమంలో డీసీలు రవికుమార్, రవీందర్‌కుమార్, ప్రశాంతి, మంగతాయారు, నాగమణి, వాల్యూయేషన్ ఆఫీసర్లు పాల్గొన్నారు.