కీసర, మార్చి 14 : కీసరగుట్ట అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.గుర్తు తెలియని వ్యక్తు లు అడవికి నిప్పు అంటించడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద సంఖ్యలో మంటల్లో చెట్లు కాలిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది చిక్కుడు నర్సింహ జిల్లా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సుమారు 10 ఎకరాల్లో నాటిన చెట్లు మంటల్లో తగలబడ్డాయి. కీసరగుట్ట గురుకుల పాఠశాల ఎదుట అటవీశాఖ ఆధ్వర్యంలో గతంలో నీలగిరి చెట్లు నాటారు. అవి కూడా ఈ మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. అటవీశాఖ అధికారుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని అటవీశాఖ సిబ్బంది చిక్కుడు నర్సింహ మీడియాకు తెలిపారు.