మేడ్చల్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేయడంతో నిరుద్యోగ యువతకు చేయూతనిచ్చేందుకు ప్రజాప్రతినిధులు ముందుకొస్తున్నారు. ఉద్యోగ సాధన పోటీ పరీక్షల్లో నిరుద్యోగులు విజయం సాధించేందుకు కోచింగ్ సెంటర్ల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రత్యేకంగా సబ్జెక్టుల వారీగా అధ్యాపకులను నియమించి కోచింగ్ ఇప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈనెల 19న రెండు సెంటర్లను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఉప్పల్లో త్వరలోనే కోచింగ్ సెంటర్..
ఉప్పల్ నియోజకవర్గంలో కూడా త్వరలోనే కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తా. మంత్రి కేటీఆర్ సూచనల మేరకు నిరుద్యోగ యువతకు అన్ని సౌకర్యాలతో కోచింగ్ ఇప్పిస్తా. పోటీ పరీక్షలకు అవసరమయ్యే అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచుతా. సబ్జెక్టుల వారీగా అధ్యాపకులను ఏర్పాటు చేస్తా. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి
19న కోచింగ్ సెంటర్ను ప్రారంభిస్తాం..
పీర్జాదిగూడలో ఈనెల 19న కోచింగ్ సెంటర్ను ప్రారంభిస్తాం. ఎంత మంది నిరుద్యోగులు వచ్చినా వారందరికీ ఉచితంగా కోచింగ్ అందిస్తాం. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. త్వరలోనే జిల్లాలోని ఎమ్మెల్యేలందరూ కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు.
కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తా..
నిరుద్యోగ యువత కోసం కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి నిరుద్యోగులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద