సిటీబ్యూరో ప్రధానప్రతినిధి, మార్చి 10 (నమస్తేతెలంగాణ) ; మహానగర రవాణా వ్యవస్థను సమూలంగా మార్చిన స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రొగ్రాం (ఎస్ఆర్డీపీ)లో మరో శకం ప్రారంభం కానుంది. మొదటిదశ పనులు చివరి అంకానికి చేరుతుండడంతో రెండోదశ పనులు ప్రారంభిస్తామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. గురువారం అసెంబ్లీ వేదికగా ఈ దశలో చేపట్టే పనుల జాబితాను వెల్లడించారు. ట్రాఫిక్ చిక్కుల తొలగింపు, వాహనాల రద్దీ నియంత్రణే లక్ష్యంగా రూ.3,115 కోట్ల అంచనాతో 12 చోట్ల ఫ్లైఓవర్లు, లింకు వంతెనలు, ఆర్యూబీ, ఆర్వోబీలను నిర్మించనున్నట్లు తెలిపారు. తొలిదశ పనులకు కొనసాగింపుగా రెండోదశను ప్రారంభించి నిర్ణీత వ్యవధిలో నిర్మాణాలు పూర్తి చేస్తామని వెల్లడించారు. మొదటిదశలో 47 పనులకు ఇప్పటివరకు రూ.5,557 కోట్లు వెచ్చించామని..ఇందులో చాలావరకు పనులు పూర్తికాగా, కొన్ని పురోగతిలో ఉన్నాయన్నారు. ఆరాంఘర్ మార్గంలో బహుదూర్‌పురా వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌ను వచ్చేనెలలో ప్రారంభిస్తామని, సెప్టెంబర్‌లోపు ఫలక్‌నుమా ఆర్వోబీని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రహదారుల విస్తరణ, వంతెనల నిర్మాణాల వల్ల నగరంలో వాహనవేగం పెరిగిందని మంత్రి వివరించారు.
తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా కొనసాగిస్తున్న వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్.ఆర్.డి.పి) రెండో దశ పనుల జాబితాను మంత్రి కేటీఆర్ గురువారం అసెంబ్లీలో ప్రకటించారు. దేశంలోని అన్ని మెట్రో నగరాలను సందర్శించే అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు తనను కలిసిన సందర్భంలో ‘అన్ని నగరాల్లో కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల వంటి నిర్మాణాలతో ట్రాఫిక్ ఇబ్బందులు లేవు’ అని చెబుతున్నారని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో ఎస్సార్డీపీ రెండో దశ కింద రూ.3,115 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న 12 నిర్మాణాలు నగర రహదారుల వ్యవస్థలో సాఫీ ప్రయాణానికి కీలక మలుపులుగా మారనున్నాయి.
వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) మొదటి దశ – 47 పనులు – ఇప్పటివరకు వెచ్చించిన వ్యయం రూ.5,557 కోట్లు – ఇందులో చాలా వరకు పూర్తి కాగా మరికొన్ని పురోగతిలో ఉన్నాయి.
మొదటి దశలో భాగంగా చేపట్టిన బహదూర్‌పుర ఫ్లైఓవర్‌ను వచ్చే నెలలో ప్రారంభించనున్నారు. ఫలక్‌నుమా ఆర్వోబీ నిర్మాణాన్ని సెప్టెంబరులోగా పూర్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు.
మరిన్ని ప్రతిపాదనలపై కసరత్తు..
నగరంలోని పలు నియోజకవర్గాలకు సంబంధించి రహదారుల వ్యవస్థ అభివృద్ధికి ఎమ్మెల్యేలు సమర్పించిన ప్రతిపాదనల్ని కూడా పరిశీలించనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇందులో భాగంగా…
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మియాపూర్-బహదూర్‌పల్లి వరకు ఆర్అండ్బి చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను హెచ్ఎండీఏకు అప్పగించే ప్రతిపాదన పరిశీలన.
బహదూర్‌పల్లి జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం
ఐడీపీఎల్ జంక్షన్ నుంచి నర్సాపూర్ జంక్షన్ వరకు విస్తరణ ప్రతిపాదనలపై ట్రాఫిక్ అధ్యయనం
పార్క్ హోటల్ నుంచి పాటిగడ్డ వరకు రోడ్డు డెవలప్మెంట్ ప్రోగ్రాం రూపకల్పన జరుగుతున్నది. ఈ ముఖ్యమైన లింకు రోడ్డు నిర్మాణాన్ని తప్పకుండా చేపడతాం.
టోలిచౌకీ ఫ్లైఓవర్ నిర్మాణ లోపాలను సవరిస్తాం. ఇంజినీర్లతో పరిశీలన చేయించి తగిన చర్యలు చేపడతాం.
ఎస్ఆర్డీపీ రెండో దశ కింద చేపట్టనున్న పనుల వివరాలు..
1. ఉప్పల్ జంక్షన్ దగ్గర రూ.450 కోట్ల అంచనా వ్యయంతో ఫ్లైఓవర్ల నిర్మాణం
2. ఖైరతాబాద్ జోన్లో బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 45 వద్ద ఫస్ట్ లెవల్ ఫ్లైఓవర్ నిర్మాణం – అంచనా వ్యయం రూ.45 కోట్లు
3. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు దగ్గర రెండో లెవల్ ఫ్లైఓవర్ నిర్మాణం – అంచనా వ్యయం రూ.100 కోట్లు
4. కార్వాన్ నియోజకవర్గంలో రేతిబౌలి, నానల్‌నగర్ జంక్షన్ల వద్ద మల్టీలెవల్ ఫ్లైఓవర్ల నిర్మాణం – అంచనా వ్యయం రూ.175 కోట్లు
5. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఫాక్స్‌సాగర్ సర్ప్లస్ నాలాపై బ్రిడ్జి నిర్మాణంతో పాటు పైప్‌లైన్ రోడ్డు నిర్మాణం – అంచనా వ్యయం రూ.45 కోట్లు
6. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఖాజాగూడ ప్రాంతంలో టన్నెల్ నిర్మాణం – అంచనా వ్యయం రూ.1087 కోట్లు
7. చాంద్రాయణగుట్టలో బండ్లగూడ జంక్షన్లో రూ.70 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణం
8. ఒమర్ హోటల్ దగ్గర రూ.70 కోట్లతో మరో ఫ్లైఓవర్ నిర్మాణం
9. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఫలక్‌నుమా-బుద్వేల్ ఆర్వోబీ నిర్మాణం – అంచనా వ్యయం రూ.150 కోట్లు
10. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని మాణికేశ్వరినగర్ వద్ద ఆర్యూబీ నిర్మాణం – అంచనా వ్యయం రూ.20 కోట్లు
11. చిలకలగూడలో మరో ఆర్యూబీ నిర్మాణం – అంచనా వ్యయం రూ.30 కోట్లు
12. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ఆరాంఘర్ వద్ద రెండు ఆర్యూబీల నిర్మాణం – అంచనా వ్యయం రూ.90 కోట్లు
రూ. 545 కోట్లతో 14 వంతెనలు
గత 65 ఏండ్లల్లో ఏ ప్రభుత్వం కూడా మూసీ వరదలు వచ్చినపుడు గరిష్ట వరద ఉధృతి ఎంత? నాలా బఫర్ ఏమిటీ? అనే వివరాలను పట్టించుకోలదు. 2014 వరకు ఆ గణాంకాలు లేవు. కానీ మొట్ట మొదటిసారి నాలాల ఉధృతిని శాస్త్రీయంగా అంచనా వేశాం. నాలాల్లో ఆక్రమణలు ఎన్ని..? బఫర్జోన్లలో ఎన్ని ఉన్నాయి? రివర్‌బెడ్‌లో ఎన్ని ఉన్నాయి? అని లెక్కలు తీస్తే దాదాపు 10 వేల నిర్మాణాలున్నాయి. ఇవన్నీ ఒక్కరోజులో వెలిసినవి కావు. హైదరాబాద్ గరిష్ట వరద స్థాయి (ఎంఎఫ్ఎల్) 1.5లక్షల క్యూసెక్కులు. ఓఆర్ఆర్ వెస్ట్ టు ఈస్ట్ వరకు మూసీ నది ప్రవాహం 55 కిమీ. ఈ ప్రాంతంలో మూసీ 84 కిమీలు డ్రాప్ అవుతుంది. కిలోమీటర్‌కు కిలోమీటరున్నర చొప్పున గ్రేడియెంట్ ఉంది. నీళ్లు నిలువ ఉండటం కోసం మూడు చెక్‌డ్యామ్‌లు. రూ. 545కోట్లతో 14 వంతెనలు నిర్మించబోతున్నాం. ఇందుకోసం పారిస్, యూరప్ వంటి దేశాల్లో పర్యటించాలని అధికారులను కోరాం. ఇందులో ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావచ్చు. దేశంలో హైదరాబాద్ నగరం చిరస్థాయిగా గుర్తుండిపోయేలా పనులు చేపడుతున్నాం.
గండిపేటలో శాశ్వతంగా నీళ్లుండేలా..
కొండపోచమ్మ సాగర్ 600 మీటర్ల ఎత్తులో రిజర్వాయర్ కట్టుకున్నాం. గండిపేట 530-540 మీటర్లు స్థాయిలో ఉంది. కొండపోచమ్మసాగర్ నుంచి నీళ్లు తెచ్చి ముత్తంగి జంక్షన్ నుంచి రావల్కోర్ చెరువు.. అక్కడి నుంచి జన్వాడ చెరువు ద్వారా గండిపేట చెరువులోకి నీళ్లను తేవటం కోసం రూ. 1250 కోట్లతో అంచనాలు సిద్ధం చేశాం. దీంతో శాశ్వతంగా గండిపేటలో నీళ్లు ఉంటాయి. గండిపేటలో శాశ్వతంగా నీరుంటే హైదరాబాద్‌కు తాగునీటి ఇబ్బంది ఉండదు. హైదరాబాద్ పేరును మరింత ద్విగిణీకృతం చేయాలన్న తపనతో ముందుకు సాగుతున్నాం. త్వరలో మూసీ పరివాహక ప్రాంత ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తాం. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 37వేల కోట్లతో 70 పనులను ప్రభుత్వం సిద్ధం చేసింది. వీటిలో వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి ప్రాజెక్టు కింద 47 పనులను రూ.8052.92కోట్లతో చేపట్టాం. ఎస్ఆర్డీపీ కింద 27 పనులను రూ. 2497.95 కోట్లతో చేపట్టిన పనులు పూర్తి అయ్యాయి. మరో రూ. 5554.97 కోట్లతో పనులు మరికొన్ని పురోగతిలో ఉన్నాయి.
అప్పు చేసి పప్పు కూడు తింటే తప్పు
ప్రభుత్వం కానీ, సంస్థలు కానీ రుణాలు తీసుకుంటాయి. అప్పు తీసుకోవటం కాదు చూడాల్సింది. తీసుకున్న రుణం ఏం చేస్తున్నారు? ఎక్కడ ఖర్చుపెడుతున్నారో చూడాలి. ఆ రుణాలను సద్వినియోగం చేసుకొని దానికి రెంట్టింపు ప్రయోజనాన్ని పొందటమే జీహెచ్ఎంసీ లక్ష్యం. అప్పుచేసి పప్పుకూడు తినొద్దు అనేది మా విధానం. ఉత్పాదక రంగంలో పెడితే ఒక్క రూపాయికి రెండు రూపాయలు సంపాదించొచ్చు.
మూసీ రూపురేఖలు మారుస్తాం..
మూసీపై రూ.3866 కోట్లతో 36 శుద్ధికేంద్రాలు
మూసీనది కాలుష్యం తొలగించేందుకు సమగ్ర ప్రణాళికను సంసిద్ధం చేసి మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నాగోల్, చాదర్‌ఘాట్..ముస్లిం జంగ్ బ్రిడ్జి వద్ద మూసీ అంచులపై వాక్‌వేలు..లాండ్స్కేపింగ్లు ఏర్పాటు చేయటం ద్వారా సుందరీకరణ పనులను చేపట్టాం. మూసీ నదిలో తేలియాడే చెత్తాచెదారాన్ని తీసేయటానికి 10 చోట్ల ఫ్లోటింగ్ ట్రాష్ బ్యారియర్స్‌ను ఏర్పాటు చేశాం. దోమల బెడదను, దుర్వాసనను అరికట్టేందుకు హైడ్రాలిక్ ఎక్స్కవేటర్, పైరోసిస్ పిచికారి వంటి కార్యక్రమాలను చేపట్టాం. మూసీ సుందరీకరణ, పునరుజ్జీవనం రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకం. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయత్వంలో సమగ్రంగా..సంపూర్ణంగా భవిష్యత్తరాలు మురిసేలా మూసీ సుందరీకరణ, పునరుజ్జీవనం చేపట్టాం. ఇందుకోసం 2014, 2015లో ప్రఖ్యాత అర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్‌తో సీఎం కేసీఆర్ శాశ్వత ప్రణాళికలు రూపొందించారు.
675 చదరపు కిలోమీటర్లున్న హైదరాబాద్ నగరం సీవరేజీ 94 శాతం మూసీలోనే కలుస్తున్నది. దీంతో మూసీ మురికికూపంగా మిగిలిపోయింది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మూసీని 100శాతం ప్రక్షాళన చేయాలని, సీవరేజ్ ట్రీట్మెంట్ తీసుకోవాలనే రూ. 3866కోట్లతో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల కోసం ఖర్చుచేస్తున్నాం. మూసీపై 36 చోట్ల సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు చేపట్టాం. ఇవన్నీ డిసెంబర్ వరకు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 46 శాతం ఎస్టీపీ జరుగుతున్నది. దేశంలో మరే నగరం ఇలా చేయటం లేదు. అయితే 100 శాతం పూర్తిచేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాం. ఇది డిసెంబర్ వరకు పూర్తి అవుతుంది.
గండిపేటలో గోదావరి నీళ్లు నింపుతాం
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే. తారక రామరావు అన్నారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు అడిగిన లిఖిత, మౌఖిక ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. వేర్వేరు సందర్భాల్లో ఆయన హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణను వివరించారు. మూసీ నది ప్రక్షాళన.. పునరుజ్జీవనం కోసం తాము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పారు. కొండపోచమ్మ నీటిని గండిపేటలో నింపి హైదరాబాద్‌కు శాశ్వత నీటి కష్టాలను దూరం చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచనా విధామని ఆయన చెప్పారు. ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, మౌజమ్ఖాన్, జాఫర్‌హుస్సేన్, పాషాఖాద్రీ, అరికెపూడి గాంధీ, కేపీ వివేకానంద, దానం నాగేందర్, బలాలా తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానాలు ఇచ్చారు. అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ఇచ్చిన సమాధానాలు ఆయన మాటల్లోనే…