మల్కాజిగిరి, ఫిబ్రవరి 20 : ప్రజల ఆరోగ్యం కోసం ఇంటి వద్దనే ఆరోగ్య సేవలు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 156 కాలనీలు, బస్తీల్లో 43,441 ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ దాదాపు నాలుగు లక్షల మంది నివసిస్తున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవడానికి ఇంటింటికి సర్వే నిర్వహిస్తున్నారు. ఇండ్లకు వెళ్లి సర్వే చేస్తున్న ఆశ వర్కర్ల ద్వారా పూర్తిస్థాయిలో ఆరోగ్య వివరాలు సేకరించి వాటిని హెల్త్ ఫైల్లో పొందు పర్చనున్నారు. ఇందు కోసం 14 మంది ఆశ వర్కర్లకు ప్రభుత్వం స్మార్ట్ఫోన్లను అందజేసింది. స్మార్ట్ ఫోన్లలో ఆరోగ్య యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. స్మార్ట్‌ఫోన్‌లో హెల్త్ ఫైల్ రికార్డు గురించి ఆశవర్కర్లకు అవగాహన కల్పిస్తున్నారు.
ప్రతి ఒక్కరికి హెల్త్ ఫైల్
ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వారికి ప్రత్యేకంగా హెల్త్ ఫైల్‌ను ఏర్పాటు చేస్తారు. కుటుంబంలోని సభ్యులు ఆరోగ్య సమస్యలు నమోదు చేస్తారు. ఇందులో గర్భవతులు, ప్రసవాలు, కేసీఆర్ కిట్, బాలింతలు, పిల్లల టీకాలు, కుటుంబ నియంత్రణ, క్షయ, బీపీ, మధుమేహం(చెక్కర), కంటి చూపు, వినికిడి, చర్మ వ్యాధులు(కుష్ఠు), మానసిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, పక్షవాతంతో ఇండ్లలో ఉన్న వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకుని స్మార్ట్ ఫోన్లో నమోదు చేస్తారు. స్మార్ట్ ఫోన్లో నమోదు చేసిన పూర్తి వివరాలు సర్వర్ నేరుగా ఆరోగ్య శాఖకు చేరుతుంది. దీంతో ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి మరింత వైద్య సేవలు అందుబాటులో పెట్టడానికి ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయనున్నారు.
ప్రజల హెల్త్ ఫైల్ సీఎం కేసీఆర్ కల
ప్రజల ఆరోగ్యం కోసం హెల్త్ ఫైల్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ కల. ప్రజల ఇంటి ముంగిట ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటాయి. ఇందుకు ఆశ వర్కర్ల ద్వారా స్మార్ట్‌ఫోన్‌లో వివరాలు నమోదు చేస్తాం. ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి బస్తీ దవాఖానల ద్వారా ఇంటి వద్దే సేవలందిస్తాం. అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పట్టణ ఆరోగ్య కేంద్రం, బస్తీ దవాఖానల ద్వారా ఇప్పటికే వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. అవసరాన్ని బట్టి ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తాం. ఆశ వర్కర్లు ఇంటింటికి వచ్చినప్పుడు కుటుంబం పూర్తి వివరాలు తెలియజేయాలి. – మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్యే