-జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు
బంజారాహిల్స్,ఫిబ్రవరి 19: తన ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వీహెచ్ కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరుతారనే అర్థం వచ్చేలా ఓ ఫేస్బుక్ పేజీలో మార్ఫింగ్ ఫొటోను పెట్టారు. ఈ ఫొటోలో సీఎం కేసీఆర్‌తో తాను కలిసి ఉన్నట్లు, మెడలో గులాబీ కండువాలు కప్పుకున్నట్లు మార్ఫింగ్ చేశారని, ఉద్దేశ పూర్వకంగానే తనపై కొంతమంది వ్యక్తులు సోషల్‌మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పీఎస్‌లో వీహెచ్ చిందులు..
సోషల్‌మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వీహెచ్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో చిందులు వేశారు. అనుమతి లేకుండా కొంతమంది వ్యక్తులు నేరుగా సీఐ గదిలోకి రావడంతో ఆయన వారిని ప్రశ్నించారు. కాసేపటికి గదిలోకి దూసుకువచ్చిన వీహెచ్ ఆగ్రహంతో ఊగిపోతూ సీఐ రాజశేఖర్‌రెడ్డిపై ఏయ్ .. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావ్. నీ సంగతి చెబుతా.. అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. పద్ధ్దతిగా మాట్లాడడంటూ సీఐ చెప్పడంతో మరింత రెచ్చిపోయిన వీహెచ్..నన్ను అరెస్ట్ చేయ్ అంటూ గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఫిర్యాదు ఇచ్చే సమయంలో కూడా సీఐతో వాగ్వాదానికి దిగారు.