ముషీరాబాద్, డిసెంబర్ 20 : శాశ్వత ప్రాతిపదికన నాణ్యమైన రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. మంగళవారం అడిక్‌మెట్ డివిజన్ బాలాజీనగర్, లలితానగర్, ఆనంద్ నర్సింగ్ హోమ్, అంజయ్యనగర్‌లో రూ.70 లక్షల వ్యయంతో చేపట్టనున్న వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రోడ్డు నిర్మాణాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ భారీగా నిధులు కేటాయించి గతంలో ఎన్నడూ లేనివిధంగా రోడ్డు నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి బస్తీ, కాలనీలో చక్కటి రోడ్డు నిర్మాణం చేపట్టడమే లక్ష్యంగా ఇటీవల పెద్ద ఎత్తున రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. లలితానగర్ వాసుల విజ్ఞప్తి మేరకు ప్రత్యేక చొరవ తీసుకొని వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. శంకుస్థాపన చేసిన రోడ్డు నిర్మాణ పనులను వారం పది రోజుల్లోగా పూర్తి చేస్తామని, అధికారులు ఎక్కడా జాప్యం జరుగకుండా చూడాలని ఆదేశించారు.
లలితానగర్‌లో నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న మురుగు నీటి లీకేజీ సమస్య పరిష్కారం కోసం కోటి రూపాయలు వెచ్చించి పైపులైన్ నిర్మాణ పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. బస్తీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. డ్రైనేజీ, మంచినీరు, విద్యుత్, రోడ్లు వంటి కనీస సౌకర్యాలు కల్పించడంతోపాటు అభివృద్ధి పనులను అధిక నిధులు కేటాయించినట్లు చెప్పారు. ముషీరాబాద్ నియోజకవర్గానికే తలమానికంగా నిలిచేలా నిర్మిస్తున్న స్టీలు వంతెన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని, వచ్చే ఏడాది మార్చి నాటికి పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ సన్నీ, ఏఈ విశ్వేశ్, వర్క్ ఇన్స్పెక్టర్ శివ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బి.మనోహర్సింగ్, బి.శ్రీనివాస్‌రెడ్డి, సురేందర్, రవియాదవ్, మాధవ్, ఎ.శ్రీనివాస్, అబ్బు, జనార్దన్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.