సిటీబ్యూరో, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): నిషేధిత గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తులను రవాణా చేస్తున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. సీపీ మహేశ్‌భగవత్ కథనం ప్రకారం.. భద్రాద్రికొత్తగూడెంకు చెందిన మిర్చి వ్యాపారి శంకర్ గంజాయి దందా చేసేందుకు సొంత వాహనం కలిగి ఉన్న నగేశ్‌ను నియమించుకున్నాడు. కర్ణాటక నుంచి గుట్కా కొని.. కొత్తగూడెంలో అమ్మితే మంచి లాభాలొస్తాయని చెప్పి..ఇద్దరు ఒప్పందం చేసుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన రమేశ్ఖాన్ను డ్రైవర్‌గా నియమించుకున్నారు. కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో గుట్కాను కొనుగోలు చేసి.. హైదరాబాద్ మీదుగా కొత్తగూడెం తరలిస్తుండగా, బుధవారం పెద్దఅంబర్‌పేట్‌లోని టోల్‌ప్లాజా వద్ద అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులతో కలిసి ఎల్బీనగర్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి బృందం తనిఖీ చేసి..పట్టుకుంది. వాహనంతో పాటు రూ. 20 లక్షలు విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
ఐదు కిలోలు..
సిటీబ్యూరో, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. పటాన్చెరు అంబేద్కర్ కాలనీకి చెందిన సతీశ్ పట్టుబడగా, అతడి నుంచి ఐదు కిలోల గంజాయి లభ్యమైంది. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
అక్కడి నుంచి తెచ్చి..
వనస్థలిపురం, ఫిబ్రవరి 16 : అసిఫాబాద్ నుంచి గంజాయిని తీసుకొచ్చి..విక్రయిస్తున్న ముగ్గురు యువకులను వనస్థలిపురం పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. స్నేహితులైన రాథోడ్ కృష్ణ(22), నరేశ్(23), మనోజ్‌రెడ్డి కొంతకాలంగా గంజాయిని నగరానికి తీసుకొచ్చి..ప్యాకెట్లుగా చేసి..అమ్ముతున్నారు. బుధవారం వాహనాల తనిఖీ చేస్తుండగా, పట్టుబడ్డారు. వీరి బ్యాగులో 600 గ్రాముల గంజాయిని గుర్తించి..అరెస్టు చేశారు.
2 కిలోలు..
జవహర్‌నగర్, ఫిబ్రవరి 16: ఒడిశా నుంచి నగరానికి అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఐదుగురు నిందితులను ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. జవహర్‌నగర్ సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం… ఒడిశా వాసి లాభాకుమార్(42) కరీంగూడ వ్యవసాయక్షేత్రంలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. స్నేహితుడి సహాయంతో ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి.. విక్రయిస్తున్నాడు. పోలీసులు పట్టుకొని.. కిలోన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గబ్బిలాల్పేట్ సమీప కాలనీల్లో గంజాయిని అమ్ముతున్న బొడ్డు అభిషేక్(20), గాజుల పరమేశ్(20), వడ్డారం వ్రవీణ్(20), శివ(20)లను అరెస్టు చేశారు. వీరి వద్ద 500 గ్రాముల గంజాయి దొరికింది.
నిఘా పెట్టి..పట్టుకున్నరు..
గుట్టు చప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్న ముఠాను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నర్సింహ తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు ఆరంఘర్- శంషాబాద్ ప్రధాన రహదారిలో నిఘా పెట్టిన పోలీసులు.. కారులో వచ్చిన నలుగురు యువకులు గంజాయి విక్రయిస్తున్న సమయంలో పట్టుకోబోయారు. రతన్‌సింగ్, రాకేశ్ పట్టుబడగా, రాజేశ్, నాగరాజు, నవీన్ కారులో తెచ్చిన 5 కేజీల్లో ఒక్క కేజీ తీసుకొని పారిపోయారు.