అంబర్పేట, డిసెంబర్ 16: స్వచ్ఛంద సంస్థలు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నల్లకుంట డివిజన్ టీఆర్టీ కాలనీలో ఇండో ఇజ్రాయిల్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ ప్రతినిధి డెక్కపాటి ఆడంరాజు ఆధ్వర్యంలో ఆశ్రయం, హ్యాండ్ ఆఫ్ హోప్ సౌజన్యంతో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరం ఎంతో అమూల్యమైనదన్నారు. ప్రజలు ఇలాంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నియోజకవర్గంలోని తులసీరాంనగర్(లంక) బస్తీలో కూడా ఇలాంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని నిర్వాహకులను కోరినట్లు తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో డెంటల్, జనరల్, కంటి పరీక్షలు, ఎక్స్రే, ఈసీజీ, అన్ని రకాల రక్త పరీక్షలు, బీపీ, మధుమేహం, క్రియాటిన్ వంటి పరీక్షలు చేశారు. అవసరమైన రోగులకు ఉచితంగా మందులను అందజేశారు. మెడికల్ డైరెక్టర్ జవహర్ కెన్నెడి మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట వ్యాప్తంగా ఐదువేల ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు మేడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.